Millers frauds in paddy procurement in Jagtial : ప్రకృతి ప్రకోపాలు, నకిలీ విత్తనాలు, తెగుళ్ల దాడికి తట్టుకొని నిలిచిన రైతన్నకు కొనుగోళ్ల ఇబ్బందులు శరాఘాతాలుగా మారుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నెల రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌లో 5 లక్షల 32 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఐతే ఇప్పటికే సగం కొనుగోళ్లు పూర్తి చేయాల్సి ఉండగా లక్షా 46 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ధాన్యం దిగుమతిలో మిల్లర్ల అలసత్వంతో పాటు లారీల కొరతతో తూకం వేసిన బస్తాల తరలింపు ఆలస్యమవుతోందని వెల్లడించారు. నెలరోజులుగా కల్లాల్లోనే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rice Millers frauds in paddy procurement in Jagtial : కొనుగోళ్ల జాప్యానికి తోడు.. మిల్లర్ల దోపిడీ రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తూకం సమయంలోనే క్వింటాలుకు 2 నుంచి 3 కిలోల అదనంగా తూకం వేస్తుండగా మిల్లర్లు మరో 3 కిలోల వరకు కోత విధిస్తున్నారు. లేదంటే లారీల నుంచి ధాన్యం దిగుమతి చేసుకోకుండా నిలిపివేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గి నష్టపోయిన అన్నదాతలకు అదనపు తూకం రూపంలో మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు.
'40రోజులు అవుతుోంది నేను పంటను కోసి. 6 ఎకరాల వడ్లు ఇక్కడ నిల్వకు ఉంచాం. వర్షాల కారణంగా కొనుగోళ్లు జరగలేదు. మా వడ్లు జోకి పది రోజులు అవుతోంది . ఇక తూకం వేస్తుండగా తరుగు పేరుతో కోత విధిస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో ఎంతో నష్టపోయాం. మద్దతు ధర లేక ఇంకా నష్టపోతున్నాం. ఇక తేమ, తరుగు పేరుతో మాపై గుదిబండ వేస్తుంటే మేమెట్లా బతికేది.' - బాధిత రైతు
కలెక్టర్కు ఫిర్యాదు : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహించారు. తేమ, తాలు పేరుతో కోతను నిరసిస్తూ శంకరపట్నంలో వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా తిప్పన్నపేటలో ధాన్యం బస్తాలు రోడ్డుపై వేసి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. జగిత్యాలలో జరిగిన ప్రజావాణిలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్ యాస్మిన్ బాషాకు ఫిర్యాదు చేశారు.
ఆదుకునేది ఎవరు : పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగి ఏటికేడు నష్టాల్లో కూరుకుపోతున్న రైతన్నలకు ప్రకృతి వైపరీత్యాలతో తీరని నష్టం మిగులుతోంది. ఇది చాలదన్నట్లు కొనుగోళ్ల జాప్యం, మిల్లర్ల దోపిడీ వారికి అదనపు భారమవుతోంది. మిల్లర్లపై చర్యలు తీసుకొని అదనపు కోతలను అరికట్టాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: