రాష్ట్రంలో అతి పెద్ద మామిడి మార్కెట్లలో ఒకటిగా జగిత్యాల మామిడి మార్కెట్ నిలుస్తుంది. అయితే... ఈసారి లాక్‌డౌన్‌తో మామిడి ధరలు పతనమయ్యాయి. జిల్లాలో 35 వేల హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన రైతులు జగిత్యాల మామిడి మార్కెట్‌కి తెచ్చి విక్రయిస్తారు. ఇక్కడి నుంచే దిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు మామిడి ఎగుమతి అవుతుంది. అయితే ఈసారి కరోనా కారణంగా దిల్లీలో లాక్డౌన్ చేపట్టడం... ఇతర రాష్ట్రాల్లోనూ లాక్డౌన్ విధించడం వల్ల ఫలరాజం ధర పడిపోయింది. ఇక్కడి నుంచి ఎగుమతి తగ్గిపోయి ధరలు పతనమయ్యాయి.
ఏప్రిల్ మొదటి వారంలో మొదలైన మార్కెట్ కిలో మామిడికి తొలుత 60 రూపాయలు పలకగా... ప్రస్తుతం 15 రూపాయల నుంచి 20 రూపాయల మధ్య కొనసాగుతోంది. ఈ ధరలతో కనీసం పెట్టుబడులూ రాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన ఎగుమతులు జరగక వ్యాపారులూ ఇబ్బంది పడుతున్నారు. గతేడాది లాక్డౌన్ ఉన్నా.. ధరలు బాగానే ఉన్నాయని... ఈసారి బాగా పడిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం