Jagtial Government School Students Acheivements : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం మగ్గిడి ఆదర్శ పాఠశాల విద్యార్థినులు క్రీడల్లో రాణిస్తున్నారు. పాఠశాల క్రీడా ఉపాధ్యాయుడు రాజేందర్ ప్రోత్సాహంతో ఇప్పటికే దాదాపు 30కు పైగా పతకాలను సాధించి బాలికలు రికార్డును సృష్టించారు. ఆదర్శ పాఠశాలలో తమ చదువు పూర్తి అయినా డిగ్రీ కరీంనగర్లో చదువుతూనే శిక్షణ మాత్రం మగ్గిడిలో 4 నుంచి 5 గంటల పాటు కసరత్తు చేస్తూ తమకున్న ఆసక్తిని చాటుకుంటున్నారు.
Jagtial Government School Students Won Gold Medals : వాస్తవానికి వెయిట్ లిఫ్టింగ్‌పై బాలికలు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ మగ్గిడి ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. శిక్షణ పొందడం ఎంతో ఇబ్బందికరమైనప్పటికి క్రీడల్లో రాణించి దేశానికి, తమ గ్రామానికి పేరు తీసుకు రావాలన్నదే తమ లక్ష్యంగా చెబుతున్నారు. అయితే తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న దృష్ట్యా శిక్షణ సామగ్రితో పాటు పౌష్టిక ఆహారం తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. దీనికి తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.
"ఇప్పటి వరకు నేను 25 మెడల్స్ సాధించాను. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొన్నాను. అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాను. లిఫ్టింగ్ అన్నది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్క కాస్ట్యూమ్ కొనాలి అంటే దాదాపుగా రూ.25 వేలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు నేను పోటీలో పాల్గొనడానికి దాదాపుగా రూ.లక్ష ఖర్చు అవుతాయి. డైట్ , ప్రాక్టీస్, ప్రోటీన్ ఇలా చాలా ఉంటాయి. మేము ఆర్థికంగా చాలా వెనుకపడి ఉన్నాం. ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నా." - విరంచి స్వప్నిక, ఏషియన్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని
మగ్గిడి ఆదర్శ పాఠశాల విద్యార్థినులు ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 60కి పైగా పతకాలు సాధించారు. వాటిలో 40 బంగారు పతకాలు, 20 సిల్వర్ పతకాలు కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో 12 మంది పాల్గొనగా 8 బంగారు ,15 సిల్వర్, 5బ్రౌంజ్ పతకాలు సాధించారు. తమకు అందుబాటులో ఉన్న వనరులతో విద్యార్థినులను తీర్చిదిద్దుతున్నానని వ్యాయమ ఉపాధ్యాయలు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మగ్గిడి పాఠశాలలో మల్టీజిమ్ ఏర్పాటు చేస్తే విద్యార్థునులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నారు.
"పవర్ లిఫ్టింగ్ అనేది ఖర్చుతో కూడుకున్న క్రీడా. రోజూ పౌష్టీకాహారం తీసుకోవాలి. రోజు రూ.600 నుంచి రూ.700 ఖర్చు అవుతుంది. వీళ్లందరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వం కనుక వీరిని ఆదుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను సాధిస్తారు. ప్రభుత్వం పాఠశాలల్లో మల్టీ జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం." - తమ్మడి రాజేందర్, క్రీడా ఉపాధ్యాయుడు.
విద్యార్థునుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలకు తగిన పరికరాలు అందిస్తే రాష్ట్రానికి పతకాలను తేవడంలో విద్యార్థినిలు కీలక పాత్ర పోషిస్తారని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: