కొబ్బరి బోండాలు.. చెట్ల ఆకులు... ఇంటి గోడలపై... ఇలా ఎక్కడ చూసినా ఆకట్టుకునే విధమైన చిత్రాలు(young woman paintings) వేస్తూ ప్రజలను చైతన్య పరుస్తుంది ఓ యువతి. చిత్రలేఖనంపై ఉన్న మక్కువతో తనలోని సృజనాత్మకతను ఉపయోగించి వివిధ రూపాల్లో అందమైన చిత్రాలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. చిత్రలేఖనంలో తనదైన ప్రతిభ కనబరుస్తోంది గుండు భాగ్యలక్ష్మి.
చిత్రలేఖనంపై మక్కువ
తనలోని సృజనాత్మకతతో అందమైన చిత్రాలకు రూపనిచ్చే ఈ యువతి పేరు గుండు భాగ్యలక్ష్మి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని చైతన్య నగర్లో నివాసం ఉంటున్న గుండు నాగేశ్వరావు, లలిత దంపతుల చిన్నకుమార్తె. భాగ్యలక్ష్మికి చిన్నతనం నుంచే చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. ఆసక్తికరమైన బొమ్మలు వేస్తున్న భాగ్యలక్ష్మి... చదువులోనూ అందరికన్నా ముందుంటుంది. ఇంటర్లో మండల టాపర్గా నిలిచి, ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
అప్పుడు సరదాగా...
చిన్నతనంలో సరదాగా చిన్నచిన్న బొమ్మలు(young woman paintings) వేసిన ఈమె... నేడు ఆలోచింపజేసే చిత్రాలను గీస్తోంది. కరోనా(corona) కారణంగా ఇంట్లోనే ఉండిపోయిన భాగ్యలక్ష్మి సమయాన్ని వృధా చేయకుండా... తనకు నచ్చిన చిత్రాలు వేసింది. ఇలా అందరి మన్ననలు పొందుతోంది. చెట్ల ఆకులపై వివిధ ఆకృతులతో అందమైన చిత్రాలను గీస్తుంది. వినాయకుడు, షిరిడి సాయిబాబా, హనుమాన్, శ్రీ కృష్ణుడు వంటి దేవతామూర్తుల చిత్రాలను గీసింది.
చిన్నప్పటి నుంచి ఆటవిడుపు కోసం వేసిన ఈ చిత్రాలే... ఇప్పుడు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బ్రూణహత్యలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వేసిన చిత్రాలు ఎంతో ప్రాముఖ్యతను తెచ్చిపెట్టాయి. మా నాన్నకు మేం నలుగురు కుమార్తెలం. బ్రూణహత్యలు నిర్మూలించడానికి నేను కొన్ని చిత్రాలు గీశాను. ఎవరికైనా అమ్మ, సోదరి, భార్య కావాలంటారు... కానీ కూతురు మాత్రం వద్దు అనుకుంటారు. దీనిపై చాలా చిత్రాలు గీశాను. కొందరైతే ఆడపిల్లలను పుట్టగానే చెత్తకుండీల్లో పడేస్తున్నారు. ఇది కరెక్టుకాదు.
-భాగ్యలక్ష్మి, యువతి
మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఈ నైపుణ్యం ఉంది. ఎప్పుడూ ఏదో ఒక ఫొటో చూసి గీస్తుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. భాగ్యలక్ష్మి గీసిన పలు చిత్రాలు చైతన్యపరిచేలా ఉంటాయి. భ్రూణహత్యలు, ఆడపిల్లలపై దాడులు, తల్లీబిడ్డల చిత్రాలు ఇలా ఆసక్తికరమైన చిత్రాలు వేస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. ప్రతిబొమ్మ ఆలోచింపజేసేలా ఉంటుంది. ఇటువంటి చిత్రాలతో పలువురి ప్రశంసలు అందుకుంటోంది. భవిష్యత్లో మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం.
-నాగేశ్వరరావు, యువతి తండ్రి