ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. జిల్లాలోని కోరుట్ల మండలంలో మోహన్ రావు పేట,చిన్న మెట్పల్లి,మాదాపూర్,పైడి మడుగు,మల్లాపూర్ మండలం రేగుంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి, పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు చేసే విధానం, కొనుగోలు కేంద్రంలోని రిజిస్టర్లను పరిశీలించారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తేమ శాతాన్ని, తూకం చేస్తున్న విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ధాన్యం లోడింగ్ ఎప్పటికప్పుడు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు క్రమపద్ధతి ప్రకారం రిజిస్టర్లో నమోదు చేసుకొవాలని, ప్రతిరోజు తేమ శాతాన్ని పరిశీలిస్తూ రికార్డు రూపంలో నమోదు చేసుకొవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, రైతులు గ్రామాల్లో వరి ధాన్యాన్ని రోడ్లమీద ఆరపెట్టడం వలన వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, కళ్లాల్లో గాని లేదా ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే ఆర బెట్టుకోవాలని సూచించారు.
అనంతరం మాదాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పైడిమడుగులో రైతు వేదిక భవనాన్ని పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న భవన నిర్మాణా పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: రైతుల సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్లో భాజపా ఆందోళనలు