జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లోని రైతువేదిక జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతువేదికల నిర్మాణం రైతుల పాలిటవరంగా మారింది. ప్రతి గ్రామంలో రైతువేదికలను నిర్మించి అన్నదాతల అవసరాల కోసం భవనాలను ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన పాలకవర్గ సభ్యులు, రైతులు కలసి సమష్టిగా భవనాన్ని అందంగా నిర్మించారు. భవన నిర్మాణం కోసం... ప్రభుత్వం 22 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తే... ఇక్కడి గ్రామస్థులు మరో ఎనిమిది లక్షలు కలుపుకొని 30 లక్షలతో రైతువేదికను వైభవంగా నిర్మించారు. భవనం ముందు రైతు దున్నుతున్నట్లు బొమ్మలను ఏర్పాటు చేశారు. భవనమంతా ఆకర్షణీయమైన రంగులతో అందరినీ ఆకట్టుకునే విధంగా అద్భుతంగా కట్టారు.
రైతులకు తెలిసేలా పథకాలు
ప్రభుత్వ పథకాలు తెలిసేలా రంగు రంగులా చిత్రాలతో బొమ్మలు వేసి... వేదిక చుట్టూ గోడలపై ఆకట్టుకునేలా గీయించారు. రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను చిత్రాల రూపంలో వివరించారు.
సేదతీరేందుకు ఉద్యానవనం
చెమటోడ్చి పంటలు పండిస్తున్న అన్నదాతలు సేదతీరేందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యానవనాన్ని పెంచి పోషిస్తున్నారు. రైతు భవన్ చుట్టూ ఖాళీ స్థలంలో పచ్చని గడ్డిని పెంచుతూ.. రకరకాల పూల మొక్కలను ఏర్పాటు చేశారు.
- ఇదీ చదవండి: రాష్ట్రంలో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు