రాష్ట్రంలో కరోనా కిట్లు, వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో కొన్ని వ్యాక్సిన్ సెంటర్లను అధికారులు మూసివేశారు. జిల్లా వ్యాప్తంగా కేవలం ఏడు కేంద్రాల్లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడంతో ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు.
జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, వెల్గటూర్, అంబారిపేటలో మాత్రమే వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. వాక్సిన్ పరిస్థితి ఇలా ఉంటే.. ర్యాపిడ్ టెస్టు కిట్ల కొరత కూడా ఎక్కువైంది. వారం రోజులుగా జిల్లాలో ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో ఒక్కో సెంటర్‌లో కేవలం 50 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో రోజు 10 వేల కిట్లు అవసరం ఉండగా.. 1600 మాత్రమే అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో కిట్లు అందుబాటులో లేకపోవటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.