ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి 40 గేట్లు ఎత్తి లక్షాయాబై వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతుండటం వల్ల జగిత్యాల జిల్లాలో గోదావరి ఉరకలెత్తుతోంది. ఒక్క సారిగా గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, బోర్నపల్లి, మంగెళ, కమ్మునూరు, జైన, ధర్మపురి, రాయపట్నం వరకు గోదావరి తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి గోదావరి వరదపై అధికారులతో సమీక్షించారు. సమీప గ్రామాల ప్రజలు గోదావరి తీరానికి వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. పశువుల, గొర్రెల కాపరులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు ఆ వైపు వెళ్లొద్దని సూచించారు. రెవెన్యూ యంత్రాంగం గోదావరి తీరాన ఉండి వరద తాకిడిని పరిశీలిస్తూ అధికారులకు నివేదిస్తున్నారు.
ఇదీ చదవండి: సొంతవారిని దూరం చేసి... వేదన మిగిల్చిన గోదావరి బోటు ప్రమాదం