Hanuman Chinna Jayanathi Utsavalu: రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జన్మదినోత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయం భక్త జన సంద్రమైంది. దీక్షా పరులు దీక్షా విరమణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి... అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు లేకపోవటంతో.. భక్తులు భారీగా తరలి వచ్చి హనుమంతుణ్ని దర్శించుకున్నారు.
ఎమ్మెల్యేల పూజలు..: ఆదిలాలాబాద్ పుర వీధుల్లో సంకీర్తనలు, భజనలతో... భక్తులు ఆధ్యాత్మికతను చాటుకున్నారు. శాంతినగర్ ఆలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో.. హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక పూజలు చేసి.. శోభాయాత్రను ప్రారంభించారు. కరీంనగర్‌లో హనుమాన్ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడలోని భీమేశ్వర, ఆంజనేయ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రామబంటుకి ప్రీతికరమైన పిండివంటలను నైవేద్యంగా సమర్పించారు.
ప్రీతికర నైవేద్యాలు: పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆంజనేయుడికి.. పాలు, పెరుగు, తేనె, చక్కెర, పండ్లరసాలు, గోదావరి జలాలతో.. మన్యు సూక్త పారాయణంతో అభిషేకాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి శ్రీ స్వయంభూ హనుమాన్ ఆలయంలో వేడుకలను భక్తిశ్రద్ధలతో జరిపారు. సిద్దిపేటలో రంగదాంపల్లి హనుమాన్ దేవాలయం నుంచి.. భాజపా, భజరంగ్‌దళ్, హిందు వాహిని ఆధ్వర్యంలో ప్రదర్శన సాగింది. పురవీధుల గుండా హనుమాన్ విగ్రహంతో పెద్ద ఎత్తున భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. సంగారెడ్డిలో హిందూ సంఘాల అధ్వర్యంలో.. ద్విచక్రవాహన ర్యాలీ తీశారు. జహీరాబాద్‌లో మాణిక్ ప్రభు వీధి నుంచి ప్రధాన రహదారి మీదుగా భారీ హనుమాన్ ఉత్సవ విగ్రహం ఊరేగించారు. అంజన్న వేషధారణలో యువకుడు భక్తులకు అభయమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఇవీ చదవండి: కోలాహలంగా అంజనీపుత్రుని శోభాయాత్ర.. మారుమోగుతోన్న జైహనుమాన్ నినాదాలు..