జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండి బయటకు పొంగిపోర్లుతున్నాయి. గ్రామాల్లో కుంటలు నిండి నీరంతా రోడ్లపైకి వస్తుండడంతో చేపల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చిన్నా, పెద్ద రోడ్లపైకి చేపల వేటలో మునిగిపోయారు.
మెట్పల్లి మండలం మేడిపల్లి, బండలింగాపూర్ గ్రామాలకు చెందిన చెరువులు పూర్తిగా నిండి నీరంతా జాతీయ రహదారిపై పారుతోంది. దీంతో చెరువులోని చేపలన్నీ నీళ్లతో పాటే బయటకు వస్తున్నాయి. గ్రామాలకు సమీపంలోనే ఉండడంతో స్థానికులు చేపలు పట్టడంలో నిమగ్నమయ్యారు.
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో చెరువులోని నీళ్లన్ని ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్నాయి. చెరువులోని చేపలు రోడ్లపైకి రావడంతో ఆయా గ్రామాల ప్రజలు గుంపులుగా పట్టుకునేందుకు వచ్చారు. దీంతో చేపల కోసం రోడ్లపైకి వస్తున్న ప్రజలతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరో రెండు రోజులు వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎక్కడికక్కడే చెరువులు, కుంటలు నిండి వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా నిండుకుండల్లా మారి జలకళను సంతరించుకున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది.
ఇదీ చూడండి: