జగిత్యాల జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కొనుగోళ్లు మొదలై నెల పదిహేను రోజులైనా ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలో 2లక్షల 98 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసి 421 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా ఇంకా సగానికిపైగా ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. ఓ వైపు అకాల వర్షాలు నష్టాన్ని తెచ్చి పెడుతుండగా... మరోవైపు ధాన్యం నాణ్యత లేదని బస్తాకు 2 కిలోలు అదనంగా తూకం వేసి రైతన్నను నిలువు దోపిడీ చేస్తున్నారు.
అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ మిల్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ధాన్యం తరలించేందుకు బస్తాకు 4 రూపాయల చొప్పుల డ్రైవర్‌కు ఇవ్వాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఏ కేంద్రం చూసినా.. ధాన్యం రాశులతో నిండిపోయి ఉన్నాయి. ఒక్కో రైతు నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం