Jagtial Farmers Protests Against Master Plan: జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ మంటలు రేపుతోంది. 2041 మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో పురపాలక సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రహదారుల విస్తరణ, ఇండస్ట్రియల్, బఫర్, కమర్షియల్, పబ్లిక్, సెమీ పబ్లిక్, పార్క్, ప్లేగ్రౌండ్స్ తదితర జోన్లను ప్రతిపాదించారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌లో విస్తీర్ణాన్ని 6084.77 హెక్టార్లుగా ప్రతిపాదించారు. ముఖ్యంగా 823.43 హెక్టార్లు పట్టణ ప్రాంతాన్ని 216.88 హెక్టార్లు రహదారుల విస్తరణ, 209.77 హెక్టార్లు కొత్త రహదారుల నిర్మాణం, 324.39 హెక్టార్లు రిక్రియేషన్, పార్కులు, 309.84 హెక్టార్లు కమర్షియల్ జోన్, 2423.10 హెక్టార్లు రెసిడెన్షియల్ జోన్, 238.68 హెక్టార్లు అడవులు, 546.18 హెక్టార్లు చెరువులు 372.12 హెక్టార్లు గుట్టలుగా ప్రతిపాదించారు.
కొత్త ప్రణాళిక ప్రకారం నర్సింగాపూర్ కండ్లపల్లి, తిమ్మాపూర్ ప్రాంతాలను పార్కులు, ప్లేజోన్, రిక్రియేషన్ జోన్లుగా.. తిప్పన్నపేట, హస్నాబాద్, లింగంపేట శివారు ప్రాంతాలను ఇండస్ట్రియల్ జోన్‌గా మోతె శివారును పబ్లిక్, సెమీ పబ్లిక్ జోన్లుగా ప్రతిపాదించారు.
రైతుల ఆందోళనలు: తెలంగాణ పట్టణ ప్రణాళిక చట్టం-2020లోని సెక్షన్ 9(2)ను అనుసరించి ఆయా పంచాయతీల నుంచి సమ్మతి అవసరముండగా హస్నాబాద్, నూకపల్లి, ధరూర్, తిప్పన్నపేట, తిమ్మాపూర్, మోతె గ్రామ పంచాయతీలు అనుకూలంగా తీర్మానాలిచ్చాయి. అయితే ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్‌తో తాము నష్టపోతామని పట్టణ ప్రజల్లో గుబులు రేపుతుండగా సమీప గ్రామాల రైతులు భగ్గుమంటున్నారు. గ్రామ సభలు నిర్వహించకుండానే సమ్మతి తెలుపుతూ తీర్మానించిన సర్పంచులు సైతం మాస్టల్ ప్లాన్ తమకు వద్దంటూ అధికారులకు విన్నవిస్తున్నారు.
తీర్మానంలో ఏముందో తమకు తెలియదని అధికారుల ఒత్తిడితో సంతకాలు చేశామంటున్నారు. కొత్త రహదారుల ప్రతిపాదన పలు జోన్ల ఏర్పాటుతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం నర్సింగాపూర్, మోతె, తిమ్మాపూర్ రైతులు కలెక్టరేట్‌కు తరలివచ్చి ప్రజావాణిలో అధికారులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం పురపాలక కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మాస్టర్ ప్లాన్ ఫ్లెక్సీని దహనం చేశారు.
అసలు ప్లాన్‌లో ఏముంది?: కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం.. బఫర్‌జోన్, ఇండస్ట్రియల్, రిక్రియేషన్, పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు లభించవు. దీంతో ఆయా ప్రాంతాల భూముల యజమానులు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతిపాదించిన కొత్త రహదారుల్లో నివాస స్థలాలు, పంట పొలాలుండటంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్-జగిత్యాల-నిజామాబాద్ వైపు ప్రధాన రహదారిని 100 అడుగుల నుంచి 160 అడుగులకు విస్తరించాలని ప్రతిపాదించారు. యావర్‌రోడ్డును 100 అడుగులు, బైపాస్ రోడ్డు 100 అడుగులు, కొత్త బస్టాండ్ నుంచి ఎల్.జి.రాం లాడ్జి వరకు 80 అడుగులు.. అక్కడి నుంచి టవర్ వరకు 50 అడుగులు, టవర్ నుంచి మార్కెట్ వరకు 50 అడుగులు, టవర్ నుంచి గంజ్‌వైపు, లడ్డుఖాజా వైపు 40 అడుగులుగా ప్రతిపాదించారు. ఎల్.జి.రాం వెనక రహదారిని 40 అడుగులు, సర్ధార్‌సత్రం నుంచి కాంతిభవన్ అరవింద్‌నగర్ మీదుగా అష్టలక్ష్మి ఆలయం వరకు 40 అడుగులు, గొల్లపల్లి రహదారిని 80 అడుగులు, ధర్మపురి రహదారి 100 అడుగులు, జంబిగద్దె ప్రాంతంలో 60 అడుగులు రహదారిగా ప్రతిపాదించగా పొన్నాల గార్డెన్ నుంచి హౌజింగ్‌బోర్డు వైపు ప్రస్తుతం ఉన్న 60 అడుగుల రోడ్డును 40 అడుగులకు, తీన్‌ఖని రహదారిని 60 నుంచి 40 అడుగులకు కుదించాలని ప్రతిపాదించారు.
తిప్పన్నపేట నుంచి పెంబట్ల కోనాపూర్ వైపు 160 అడుగులు ధర్మపురి జాతీయ రహదారి-పెంబట్ల-కోనాపూర్ రహదారిని కలిపేలా పొలాల్లోంచి 200 అడుగుల రహదారి, గోపాల్‌రావుపేట నుంచి తిమ్మాపూర్ రహదారిని కలిపేలా 60 అడుగులు, నల్లగుట్ట నుంచి పొలాస వైపు 200 అడుగుల రహదారిని ప్రతిపాదించారు. ధర్మపురి రహదారిలో సుమంగళి గార్డెన్ సమీపంలో సర్వే నంబర్లు 327, 283, 285లో పార్కుగా చూపించారు. అక్కడి నుంచి ముప్పారపు చెరువు వైపు 40 అడుగుల రహదారిని ప్రతిపాదించారు.
మాస్టర్ ప్లాన్‌లో కొన్ని కొత్త రహదారులు ప్రతిపాదించారు. హౌజింగ్‌బోర్డు నుంచి అచ్చు బండపోచమ్మ గుడి నుంచి అంతర్గాం వెళ్లే కెనాల్ రహదారిని 80 అడుగులుగా కొత్త రహదారిని ప్రతిపాదించారు. శ్రీనగర్ కాలనీ నుంచి లింగంపేట రహదారిని కలిపేలా 40 అడుగుల రహదారి, పొన్నాల గార్డెన్ చౌరస్తా నుంచి 1262, 1258, 1266, 1300 సర్వే నంబర్ల మీదుగా గుట్టరాజేశ్వరస్వామి వరకు 40 అడుగుల కొత్త రహదారి ప్రతిపాదించారు. కరీంనగర్ ప్రధాన రహదారి ధరూర్‌వాగు వద్ద నుంచి పంట పొలాల్లోంచి ఇటువైపు అంతర్గాం కెనాల్ రహదారిని కలిపే విధంగా అటువైపు నర్సింగాపూర్ రహదారిని కలిపేలా 60 అడుగుల కొత్త రహదారిని ప్రతిపాదించారు.
ఇవీ చదవండి: