Farmer Protest With Flexi: ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగిలో వరి వేయవద్దంటే నీళ్లు అందుబాటులో ఉన్నా పంట వేయలేదంటూ జగిత్యాల జిల్లాలో ఓ రైతు తన వ్యవసాయ భూమి వద్ద ఫెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపాడు. సీఎం కేసీఆర్ మాటలు నమ్మి తాము వరి పంట వేయకపోగా.. ఇప్పుడు ప్రతి గింజ కొంటానని చెప్పడం రైతులతో రాజకీయం చేయడమేనని పేర్కొన్నాడు. మల్లాపూర్ మండలం రాఘవపేటకు చెందిన సుద్దు సురేందర్ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు.
వరి వేస్తే కొనలేమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వల్లనే తనకున్న ఎనిమిది ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని వదిలేశానని పేర్కొన్నాడు. వరి వేస్తే కొనమని ప్రభుత్వం చెప్పడం వల్లే భూమిని పడావుగా వదిలేశానని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు స్వగ్రామం రాఘవపేటలో ఈ ఫ్లెక్సీ వెలియడం చర్చనీయాంశంగా మారింది. పంటలు వేసే సమయంలో వరి పంట వేయవద్దంటూ రైతులను ఆగం చేసి ఇప్పుడు ప్రతి గింజ కొంటానంటున్న సీఎం.. పంట వేయని రైతులకు పరిహారం గురించి ఆలోచన చేయాలని రైతు సురేందర్ కోరారు.
'వరి వేస్తే ఉరే అన్న సీఎం కేసీఆర్ మాటలు నమ్మి నాకున్న 8 ఎకరాల భూమిని పడావుగా వదిలేశా. ఆ భూమిలో వేరే పంట పండదు.. ఎందుకంటే అక్కడ 365 రోజులు నీళ్లు ఉంటాయి. ముఖ్యమంత్రి వడ్లు కొనమన్నడు కాబట్టి పడావుగా వదిలేశాం. ఇట్ల నేనొక్కడినే కాదు చాలా మంది రైతులు వరి వేయకుండా బీడుగా వదిలేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు కొనమన్నారు. మళ్లీ ఇప్పుడు కొంటామని ప్రకటించారు. నేనొక్కడినే 8 ఎకరాలు పడావుగా వదిలేశా. దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేయొద్దు. ఓట్ల రాజకీయం కోసం నిన్నొకటి, ఇవాళొకటి చెప్పి రైతులను మోసం చేస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే స్వగ్రామమైన రాఘవపేటలో నా వ్యవసాయ భూమి పక్కనే ఫ్లెక్సీ ఏర్పాటు చేశాను. ముఖ్యమంత్రికి నా ఆవేదన తెలియజేయాలనే నా ఉద్దేశం. ఇలా నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరుతున్నా. - సుద్దు సురేందర్, రైతు, రాఘవపేట, జగిత్యాల జిల్లా
ఇవీ చదవండి: