భారీ వర్షాల అనంతరం వరద తగ్గుముఖం పట్టడంతో వాగూవంకల నుంచి వివిధ రకాల చేపలు బయటకు వస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మనగర్ గ్రామానికి చెందిన గొల్లపెళ్లి రాజనర్సు అనే మత్స్యకారునికి అరుదైన చేప దొరికింది. చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లి గాలం వేయగా వింత చేప వలకు చిక్కింది. చేతికి చిక్కిన చేపను చూసి రాజనర్సు ఆశ్చర్యానికి గురయ్యారు. తాను ఎన్నో ఏళ్లుగా చేపలు పడుతున్నానని.. ఇలాంటి చేపలను ఎప్పుడు చూడలేదని తెలిపారు.
ఈ విషయమై జిల్లా మత్య్సశాఖ అధికారులకు సమాచారమివ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. చేపను పరిశీలించిన అధికారులు.. దీనిని డెవిల్(దెయ్యపు) చేప అంటారని చెప్పారు. ఈ రకం చేపలు ఎక్కువగా సముద్రంలో ఉంటాయని తెలిపారు. మన రాష్ట్రంలోని వాగులో దొరకడం చాలా అరుదని పేర్కొన్నారు. ఎగువన కురిసిన వర్షాలకు కాలువల ద్వారా వచ్చి ఉండొచ్చని వివరించారు. ఈ విచిత్ర చేపను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు.
ఇదీ చదవండి: Harish Rao: 'ఆంధ్రా మొండి వైఖరి వల్లే న్యాయమైన వాటాలో కోత'