Devadula Lift Irrigation: దేవాదుల జలాశయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో మొదలుపెట్టింది. తొలుత 38 టీఎంసీల నీటిని ఉమ్మడి వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల రైతులకు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. దేవాదుల ఎత్తిపోతల సామర్థ్యాన్ని 60 టీఎంసీలకు పెంచిన ప్రభుత్వం.. 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనే లక్ష్యం పెట్టుకుంది.
కనీసం పది టీఎంసీల జలాశయం ఉండాలి..
ఎత్తిపోతల సామర్థ్యం పెంచాలంటే ప్రాజెక్టుకు అనుసంధానంగా కనీసం 10 టీఎంసీల సామర్థ్యంతో ఒక్క జలాశయమైనా ఉండాలి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 18 జలాశయాలున్నా... అన్నీ కలిపి కేవలం 8 టీఎంసీల సామర్థ్యం మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో 2018లో ప్రభుత్వం జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగంపల్లి వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం ప్రతిపాదించింది. 3,200 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. జలాశయం కోసం 4,400 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. కానీ మూడేళ్లు గడుస్తున్నా పనుల్లో ముందడుగు పడటం లేదు.
భారీగా పెరిగిన అంచనా వ్యయం..
Devadula works delay: ప్రాజెక్టు పనుల జాప్యంతో ఓవైపు అంచనాలు పెరుగుతున్నాయి. తొలుత 6 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా... పలుమార్లు సవరింపుల తర్వాత ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఏకంగా 13 వేల 445 కోట్లకు చేరింది. దేవాదుల మొత్తం మూడు దశల్లో 16 ప్యాకేజీలతో నిర్మిస్తుండగా... ఇప్పటికి కేవలం ఒకటో దశ మాత్రమే పూర్తయ్యింది. 2021 మార్చికల్లా పనులు పూర్తికావాల్సి ఉన్నా... సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో అంచనా వ్యయం మరో 1500 కోట్లు పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. లక్ష్యానికి అనుగుణంగా త్వరగా పనులు పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో తాము పనిచేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ పనులతోపాటు, మూడో దశలోని సొరంగం పనులను వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నామని అధికారులు చెబుతున్నారు.
ఇదీచూడండి: Ktr respond on Agri Laws: రద్దు చేసిన వాటిని మళ్లీ తెస్తామనడం అద్భుతం: కేటీఆర్