అభం శుభం తెలియని ఆ చిన్నారుల పట్ల విధి చిన్నచూపు చూసింది. అమ్మ నాన్నలతో కలిసి గడపాల్సిన వయసులోనే వారిని దూరం చేసింది. ఉండడానికి గూడు లేని ఆ చిన్నారులు సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన సాకార భూమయ్య, రాజకళ దంపతులు వలస కూలీలు. దినసరి కూలీ చేసి జీవనాన్ని కొనసాగించేవారు. వీరికి సకారం గణేష్ (15), మనోజ్ (6) ఇద్దరు కుమారులు ఉన్నారు. చేతనైన పని చేసుకుంటూ పొట్టపోసుకుంటూ కాలం వెల్లదీస్తున్న వీరి జీవితంలో కరోనా(corona) కాటు తీరని విషాదం నింపింది. కొవిడ్(covid)తో ఐదు నెలల క్రితం పిల్లల తండ్రి భూమయ్య మృతి చెందాడు.
అప్పటికి గర్భవతిగా ఉన్న రాజకళ చేతనైన పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ప్రసూతి కోసం ఈ నెల 19న ఆస్పత్రికి వెళ్లింది. కడుపులోనే పసిపాప మరణించిందని వైద్యులు తెలిపారు. అంతలోనే రాజకళ పరిస్థితి విషమించింది. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ విషాద ఘటనతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. అమ్మమ్మతో కలిసి బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు.
కలెక్టర్ రవి సంబంధిత అధికారుల ద్వారా చిన్నారులకు ఆపన్నహస్తం అందించారు. నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలను అందేలా చూసి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్(ktr)... కలెక్టర్‌ను ట్విట్టర్ వేదికగా అభినందించారు.
ఇదీ చదవండి: Covid cases in India: మూడో రోజూ 2 లక్షల దిగువకు..