CM KCR Speech at BRS Public Meeting at Korutla Today : రైతు బంధు వల్ల రైతులు అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా పోయిందని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. మిగిలిన రైతులకు కూడా రుణమాఫీని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ధరణి తీసివేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రైతు బంధు దుబారా అని ఒక కాంగ్రెస్ నేత అన్నారని గుర్తు చేశారు. రైతు బంధు ఉండాలో వద్దో.. రైతులే ఆలోచించాలన్నారు. 24 గంటల కరెంటు వద్దు.. మూడు గంటలు చాలు అని రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని హర్షించారు. తలసరి విద్యుత్ వినియోగంలో తామే మొదటి స్థానంలో ఉన్నామని సగర్వంగా చెప్పుకున్నారు.
BRS Public Meeting at Korutla : మూడు గంటలే కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. మీకు 24 గంటలు కరెంటు కావాలా వద్దా అని ప్రశ్నించారు. 24 గంటల కరెంటు కావాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌నే రావాలన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు సెక్యులరిజం విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. 12 వేల కోట్ల రూపాయలను మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేశామన్నారు.
రైతులు బాగుంటే పల్లెలు బాగుంటాయని ఆలోచించే నీటి తీరువా తీసేశామని.. బకాయిలు రద్దు చేశామని సీఎం కేసీఆర్ వివరించారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు దరఖాస్తు చేసుకున్నా.. రైతు బంధు నేరుగా ఖాతాల్లో వేస్తున్నామని తెలిపారు. రెండుసార్లు రైతు రుణాలు మాఫీ చేశామని.. ఎన్నికల కోడ్ కారణంగా కొద్ది మందికి మాత్రమే రుణమాఫీ ఆగిపోయిందన్నారు. తొందరలో అవి కూడా పూర్తి చేస్తామన్నారు.
"మీకు ఒకటే మాట మనవి చేస్తున్నా. ఏదైనా దేశం బాగుపడిందా వెనకకు పోయిందా అని చూడడానికి రెండు గీటు రాళ్లు ఉంటాయి. ఒకటి ఆరాష్ట్రం తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ 15 లేదా 18వ స్థానంలో ఉండేది తలసరి ఆదాయంలో. ఈ రోజు తెలంగాణ మీరందరి సాకారంతో, అద్భుతమైన పంటలతో ఆర్థికంగా ఎదిగి ఇండియాలోనే నంబర్ వన్‌గా ఉంది. కరెంటు వినియోగంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉంది." - కేసీఆర్, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు
BRS Praja Ashirvada Sabha at Korutla : ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. దీంతో మళ్లీ దళారులు వస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ రైతు బంధు ఇచ్చి బేకారు చేస్తున్నాడని.. దుబారా చేస్తున్నాడని చెబుతున్నారని విమర్శించారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రైతు బంధు కింద రూ.16 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. 93 లక్షల మంది రేషన్ కార్డుదారులకు వచ్చే ఏడాది మార్చి నెల నుంచి సన్నబియ్యం ఇస్తామని కేసీఆర్ హామీనిచ్చారు.