జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 60 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. రెండు రోజుల క్రితం ర్యాపిడ్ పరీక్ష నిర్వహించారు. అందులో పాజిటివ్ అని నిర్ధరణ అయింది. చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరణించాడు. కరోనాతో మృతి చెందడం వల్ల అంతక్రియలు నిర్వహణకు కుటుంబసభ్యులు, బంధువులు ముందుకు రాలేదు.
దీనితో మృతుడి కుమారుడు కోరుట్లకు చెందిన ముస్లిం మైనార్టీ యువకులు ఏర్పాటు చేసిన ఆలిండియా మానవత్వ సందేశ సమితి అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులకు చరవాణి ద్వారా సమస్యను దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సంస్థకు చెందిన నజీర్అలీ, ఇషాక్, హఫీజ్, ముజాహిద్ కలిసి కొవిడ్ నిబంధనల మేరకు పీపీఈ కిట్లు ధరించి.. అన్నీ తానై ఆ నలుగురు ఆ వృద్ధునికి స్మశాన వాటికలో అంతక్రియలు నిర్వహించారు.
మతాలకు అతీతంగా ఈ స్వచ్ఛంద సంస్థ ధైర్యంగా ముందుకు వచ్చారు. కొవిడ్‌తో మరణించిన వారికి సొంత కొడుకులా మారి.. వారికి అంత్యక్రియలు నిర్వహిస్తూ.. మానవత్వాన్ని కాపాడుతున్నారు. ఈ సంస్థ వారు ఇప్పటివరకు కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కరోనాతో మరణించిన పది మందికి వారి ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తున్నారు.