ఏపీలోని విశాఖలో కొవిడ్ బాధిత బాలుడికి విజయవంతంగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన నాలుగేళ్ల బాలుడు జిప్ లాక్‌ను మింగేశాడు. ఈ విషయమై బాలుడి తల్లిదండ్రులు స్థానిక ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించారు. వైద్యుని సూచన మేరకు ముందుగా కొవిడ్ పరీక్ష చేయించగా పాజిటివ్‌గా తేలింది. తల్లిదండ్రులకు కూడా పరీక్షలు చేయగా తల్లికి పాజిటివ్, తండ్రికి నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. కొవిడ్ కేసు కావడం వల్ల అప్రమత్తమైన అధికారులు బాలుడిని కొవిడ్ ప్రాంతీయ అసుపత్రి విశాఖలోని విమ్స్‌కి తరలించారు.
బాలుడు రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడం వల్ల తీవ్రంగా నీరసించిపోయాడు. అపస్మారక స్థితికి చేరుకునే ప్రమాదాన్ని గుర్తించిన ఈఎన్టీ వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి గొంతులో నుంచి జిప్‌ను బయటకు తీశారు. కొవిడ్ చికిత్స కోసం బాలుడిని ఆస్పత్రిలోనే ఉంచినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. బాలుడు కోలుకుంటున్నట్లు వెద్యులు వెల్లడించారు.
ఇదీ చూడండి : జగన్నాథ రథయాత్ర చరిత్రలో తొలిసారి ఇలా...