న్యూ ఇయర్ రోజున రాజధాని నగరంలో చిన్న ప్రమాదం కూడా జరక్కుండా.. సంతోషంగా మొదలవ్వాలన్న లక్ష్యంతో పోలీసు ఉన్నతాధికారులు చేసిన కృషి ఫలించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో ఒక్క ప్రమాదం కూడా నమోదు కాలేదు. కొత్త సంవత్సరం ప్రమాద రహితంగా ప్రారంభమవ్వాలని పోలీస్ కమిషనర్లు వి.అంజనీకుమార్, వి.సి.సజ్జనార్, మహేష్ భగవత్‌లు తీసుకున్న పక్కా చర్యలతోనే ఇది సాధ్యమైంది.
నగర పోలీసుశాఖ.. మూడు కమిషనరేట్ల పరిధుల్లో 200 పైగా ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించింది. గురువారం రాత్రి 11 నుంచి ఉదయం 3గంటల వరకు తనిఖీలు జరిగాయి. గ్రేటర్ వ్యాప్తంగా నాలుగు గంటల్లో 1821 మందిపై కేసులు నమోదైయ్యాయి. ఒక్క హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మితిమీరిన వేగం, వాహనాలపై పరిమితికి మించి ప్రయాణించినందుకు 605 కేసులు నమోదు చేశారు పోలీసులు.
‘ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం వల్లే ‘జీరో యాక్సిడెంట్’ను సాధించాం. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు పక్కాగా చేపట్టాం. లాంగ్ వీకెండ్ ఉండడంతో శుక్ర, శనివారాల్లోనూ డ్రంకెన్ డ్రైవ్‌ను కొనసాగించనున్నాం.’
-అనిల్, అదనపు సీపీ(ట్రాఫిక్), హైదరాబాద్.
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణానికి కారణమైతే పదేళ్ల జైలు!