Yuga Tulasi foundation: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో గో ఆధారిత నైవేద్యం సమర్పించాలని యుగ తులసి ఫౌండేషన్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించేందుకు వారు పండించిన ఉత్పత్తులను ఆలయాల్లో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. హైదరాబాద్ సైఫాబాద్‌లోని అరణ్య భవన్లో యుగ తులసి ఛైర్మన్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె.శివ కుమార్, సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ రామకుమార్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.
యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో ఆధారిత నైవేద్యం ఏర్పాటు చేయడానికి ఒక మంచి ప్రతిపాదన రావడం జరిగింది. ప్రతి దేవాలయంలో ఆవు ఆధారిత నైవేద్యం సమర్పిస్తే బాగుంటుందని చర్చించడం జరిగింది. నైవేద్యం కోసం ప్రత్యేకంగా రైస్‌ను పండిస్తున్నారు. మన వికారాబాద్‌లోనే ఈ రకమైన పంట పండిస్తున్నారు. మన దగ్గర కూడా ఆలయాల్లో ఆవు నెయ్యితో నైవేద్యం సమర్పించాలని కోరారు. మన రాష్ట్రంలో కూడా అందించేలా చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. - అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
గో సంతతి వృద్ధి
yuga tulasi on cows: త్వరలో పునః ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి ఆలయంలో స్వామివారికి గో ఆధారిత నైవేద్యాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ఆలయాల్లో గో ఆధారిత నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని మొదలు పెడితే ఇక్కడ గోవుల సంతతి వృద్ధి చెందుతుందన్నారు. రైతులను మరింత ప్రోత్సహించేందుకు గో ఆధారిత వ్యవసాయంపై వారికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రికి వివరించారు. నేలతల్లిని కాపాడి ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించే దిశగా రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే... జాతీయ గో మహా సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ కె.శివ కుమార్ చెప్పారు.
ఈరోజు దేశవ్యాప్తంగా గోవులను రక్షించుకోవాలి. అదే మా నినాదం. తితిదేలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో గో ఆధారిత నైవేద్యం సమర్పించారని మనం విన్నాం. దేశీ గోవుల ద్వారా పండించిన ధాన్యాన్ని తిరుమలకు చేర్చి గో ఆధారిత నైవేద్యం అందించే కార్యక్రమం ప్రవేశపెట్టాం. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించే విధంగా తితిదే ముందుకు రావడం సంతోషం. అలాగే తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో ఇలాంటి విధానాన్ని తీసుకురావాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరడం జరిగింది. దీనిపై మంత్రి సానూకులంగా స్పందించారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. -
శివ కుమార్, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్.
గో నైవేద్యం అందించేందుకు కృషి
దేవతామూర్తులకు స్వచ్ఛమైన ఆవుపాలు, నెయ్యి, బియ్యం, పప్పులు అందించాలనే లక్ష్యంతో యుగ తులసి, సేవ్ ఫౌండేషన్ల కృషి అభినందనీయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణలోని దేవాలయాల్లో గో ఆధారిత నైవేద్యాన్ని ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామన్నారు.