గోవు ఆధారిత దేశంగా పిలుచుకునే భారత్ లో గోమాత సంరక్షణను చేపట్టడమే లక్ష్యంగా ప్రముఖ హిందూ సంస్థ యుగ తులసి ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త పిలుపు నిచ్చింది. కసాయిల చేతుల్లో గోవులు బలి కాకుండా రక్షించేందుకు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలనీ... అందుకోసం నేను సైతం గోమాత కోసం అని నినదించాలని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు శివకుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు విశేష స్పందన లభించింది. గోవుల సంరక్షణలో తమవంతు బాధ్యత చాటుకుంటామంటూ అనేక మంది సెల్ఫీ వీడియోలు తీసి యువ తులసి ఫౌండేషన్‌కు పంపించారు. ఇలా కేవలం 10 రోజుల్లోనే 70 వేల మంది గోమాత రక్షణకు పాటుపడుతామంటూ ముందుకొచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడుగా ప్రమాణస్వీకారం సమయంలో లక్ష గోవుల సంరక్షణ చేపడుతానని ప్రమాణం చేశానని... ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుగ తులసి వ్యవస్థాపకులు శివకుమార్ తెలిపారు. కబేళాలకు తరలిపోతున్న ఆవులను రక్షిస్తూ గోమాతపై అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
శివకుమార్ పిలుపునకు స్పందించిన సినీ ప్రముఖులు మోహన్ బాబు, సాయి కుమార్, అల్లు అరవింద్, వీవీ వినాయక్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల సహా జబర్దస్త్ నటీనటులు గో సంరక్షణలో బాధ్యత పంచుకుంటామని తెలిపారు. నేను సైతం గోమాత కోసం కార్యక్రమంతోపాటు గోవుల సంరక్షణ కోసం నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేసేందుకు యుగ తులసి ఫౌండేషన్ సిద్ధమవుతోంది.