ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం నేటితో ముగియనుంది. టి.డి జనార్దన్, బీద రవిచంద్ర, గౌనివారి శ్రీనివాసులు, పి.శమంతకమణి పదవీకాలం ఇవాళ పూర్తి కానుంది. ఈ నాలుగు స్థానాలకు కొత్త అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నలుగురి పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు దస్త్రం పంపినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకు ఇవాళ, రేపట్లో గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మోసేను రాజు, గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక కౌన్సిలర్‌గా ఉన్న ఆర్వీ రమేష్ యాదవ్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం.
గతంలో ఎమ్మెల్యేల కోటా తర్వాత గవర్నర్ కోటాలో దాదాపు ఖరారై చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన మోసేను రాజుకు ఇప్పుడు అవకాశం ఇచ్చినట్లు వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో చివరి క్షణంలో ఎమ్మెల్యే టికెట్ కోల్పోయిన లేళ్ల అప్పిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఛైర్మన్ పదవికి రమేష్ యాదవ్ దాదాపు ఖరారైనా, సామాజిక సమీకరణలో భాగంగా అవకాశాన్ని కోల్పోయారు. కౌన్సిలర్‌గా ఉన్న ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని గతంలో పలుమార్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నలుగురి పేర్లు గవర్నర్ కోటాలో ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి.
- ఇదీ చూడండి: CCMB: కరోనా రాకుండా మాస్కు ఎలా ధరించాలో తెలుసా!