YSRCP Activist Threatening Phone Call: ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జరిగిన అఖిలపక్షాల మహిళా నేతల సమావేశంలో పాల్గొన్న.. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఓ వైకాపా కార్యకర్త బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. గోరంట్ల మాధవ్ విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారంటూ అనితను నిలదీశాడు. ఆయన అంత పెద్ద తప్పు ఏం చేశారంటూ ప్రశ్నించాడు. ఓ వైపు దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే... అతిగా స్పందించాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నలు విసిరాడు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతుండగా మాధవ్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
వివాదం ఏంటంటే..: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి కలకలం రేపింది. ఈనెల 4న (గురువారం) ఉదయం 8 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో.. కొద్దిసేపటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడటాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో ఫోన్‌తో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో తొలుత ఈ వీడియో వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాసేపటికి ట్విటర్‌లోనూ కొంతమంది దాన్ని షేర్ చేశారు. గురువారం ఉదయం ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ ఆ వీడియో నకిలీది అనీ, తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఇదంతా తెదేపా, కొంతమంది మీడియా వ్యక్తుల కుట్ర అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు.
ఇదీ చూడండి: ప్రతిపాదనలు అంగీకరిస్తే భాజపాలో చేరేందుకు సిద్ధం: జయసుధ