Manchu Manoj Complaint on Vishnu : మంచు కుటుంబంలో మళ్లీ వివాదాల మంటలు చెలరేగుతున్నాయి. మంచు విష్ణుపై పహాడిషరీఫ్ పోలీసులకు తన తమ్ముడు మంచు మనోజ్ తాజాగా ఫిర్యాదు చేశారు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని మనోజ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. విష్ణుతో పాటు తన అన్న సహచరుడు వినయ్ పేరును సైతం ఫిర్యాదులో ప్రస్తావించారు. మొత్తంగా 7 అంశాలను ప్రస్తావిస్తూ మనోజ్ తన కంప్లైంట్‌ను ఆన్లైన్లో పంపినట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా మంచు మోహన్‌బాబు కుటుంబ వివాదాలతో సతమతమవుతోంది. ఈ వివాదాలు మంచు మనోజ్‌తో ఈ మధ్య వెలుగులోకి వచ్చాయి. ఆస్తి పంపకాలలో ఈ గొడవలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ డిసెంబరు 10వ తేదిన జల్పల్లి నివాసంలోకి గేట్లను బద్దలు కొట్టుకుని వెళ్లడం జరిగింది. మీడియా కూడా అదే మాదిరిగా ఇంటి ఆవరణలోకి వెళ్లడానికి ప్రయత్నించారు.
మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు : మంచు విష్ణు, వినయ్ మహేశ్వరి, విజయ్ రెడ్డి, కిరణ్, రాజ్ కొండూరు, శివ, వన్నూర్లపై చర్యలు తీసుకోవాలని మనోజ్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో కోరారు. వీరి వల్ల తన భార్య, పిల్లలకు ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదులో తెలిపారు. మోహన్‌బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు, మంచు విష్ణు, వినయ్ మహేశ్వరి ఆధీనంలో ఉన్న ట్రస్ట్, వెల్ఫేర్పై నేను నిలదీశానని చెప్పారు. అప్పటి నుంచి తనను చంపేస్తామని తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయన్నారు. సెప్టెంబర్ 11న తాను వినయ్‌కి ఒక సందేశం పంపినట్లు తెలిపారు.
ఆ సందేశంలో యూనివర్సిటీ బాగు గోసం ఎంతో చేశానని, ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని చెప్పినట్లు తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులు సంతోషంగా లేరనే విషయాన్ని ఆ సందేశంలో చెప్పానని తెలిపారు. అప్పటి నుంచి విష్ణు అతని అనుచరులు తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. సెప్టెంబర్ 13న విష్ణు, వినయ్‌లు నా తండ్రి మోహన్‌బాబు ఫోన్ నుంచి సందేశం పంపించారని, తాను ఆస్తుల కోసం ఇదంతా చేస్తున్నానని నా వ్యక్తిత్వాన్ని కించపరిచినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 8న జల్పల్లిలో తనతో పాటు కుటుంబంపై దాడి చేసేందుకు ప్రత్నించగా డయల్ 100 కాల్ చేస్తే నన్ను పోలీసులు రక్షించారన్నారు.
ఆస్తుల గురించి ఎప్పుడు అడగలేదు : దీనిపై ఫిర్యాదు ద్వారా పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు గుర్తుచేశారు. తన కుటుంబ సభ్యులపై అప్పుడు ఫిర్యాదు చేయలేదని తన ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తులు సంచరించి దాడి చేసి మరీ సీసీటీవీ ఫుటేజ్‌ను దొంగలించడంపై ఫిర్యాదు చేశానన్నారు. తాను, తన భార్య ఎప్పుడూ ఆస్తుల విషయం గురించి ఆలోచించలేదని వెల్లడించారు. డిసెంబర్ 9న విష్ణు, వినయ్, రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలు మాదాపూర్‌లోని విష్ణు కార్యాలయంలో సమావేశమై తనను కించపరచడానికి నా తండ్రి మోహన్‌బాబు వాయిస్ నోట్ పంపించారన్నారు.
భయంతోనే డీజీపీ ఆఫీస్‌కు వెళ్లాం : డిసెంబర్ 10న విష్ణు, విజయ్ రెడ్డి, కిరణ్ ఇతరులు ఇంట్లోకి ప్రవేశించి తన స్టాఫ్‌ని కొట్టారని కత్తులు, తుపాకులు తేవాలని అరుస్తున్న మాటలు వినిపించాయన్నారు. భయంతో వెంటనే తన భార్యతో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లినట్లు చెప్పారు. ఇంతలోనే విష్ణు అతడి అనుచరులు జల్పల్లిలోని ఇంటికి తమను లోపలికి రాకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. బలవంతంగా లోపలికి వెళ్లిన తమపై దాడి చేసి మీడియాకు మాత్రం వేరే వీడియోలు పంపారని ఫిర్యాదులో వివరించారు.
డిసెంబర్ 14న నా తల్లి పుట్టిన రోజున విష్ణు అతని అనుచరులు ఇంట్లోకి వచ్చి జనరేటర్లో పంచదార పోసి కుట్రకు తెరలేపారని, తాను ఇంట్లో నుంచి వెళ్లిపోవట్లేదని ఇందంతా చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనల దృష్ట్యా తనకు న్యాయం చేయాలని మనోజ్ కోరుతున్నట్లు తెలిపారు. రక్షణ కల్పించాలని కోరారు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
'జనరేటర్లో పంచదార'లో ఏమాత్రం నిజం లేదు : మోహన్‌బాబు భార్య లేఖ
'నా ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించలేదు' - మోహన్‌బాబు మరో ట్వీట్