ఆజంతు ప్రదర్శన శాలలో ఏనుగు మీ తమ్ముడవుతుంది... ఖడ్గమృగం కొడుకులా ఉంటుంది.. ఆ బుజ్జి కోతిని సోదరిలా పిలవచ్చు.. ఇదంతా ఎలా సాధ్యం..! నరమాంసం భక్షించే జంతువులతో స్నేహం చేయవచ్చు.. జంతు ప్రేమికులై ఉండి మీకు నచ్చిన జంతువును.. క్రూర మృగనైన్నా దత్తత తీసుకోవచ్చు. నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోనే సిబ్బంది సాయంతో పూర్తి సంరక్షణ బాధ్యతలు మీరు తీసుకోవచ్చు. మీకు నచ్చిన పేర్లు వాటికి పెట్టుకోవచ్చు. ఇప్పటికే నగర వాసులు జంతువులను దత్తత తీసుకొని తమ్ముడు, కొడుకు, చెల్లి అంటూ వరుసలు కలుపుకొని బంధువులుగా చేసుకున్నారు.
వన్యప్రాణి దత్తత.. మన బాధ్యత
మూగజీవాల దత్తతకు నగరవాసులు బాధ్యతగా ముందుకొస్తున్నారు. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ వన్యప్రాణి దత్తత కార్యక్రమం ప్రజల్లోకి చేరేందుకు కొంచెం సమయం పట్టింది. ఇప్పుడు పెద్దఎత్తున వ్యాపార సంస్థలు, వ్యక్తులు వ్యక్తిగత ఆసక్తితో ముందుకొస్తున్నారు. వాటి సంరక్షణకయ్యే పూర్తి ఖర్చుల్ని భరిస్తున్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.42లక్షలు వీటి సంరక్షణకు జమవ్వడమే ఇందుకు నిదర్శనం.
జంతుజాలానికి నెలవు..
కనుమరుగయ్యే దశకు చేరుకున్న జంతుజాలానికి నెలవు నెహ్రూ జంతు ప్రదర్శనశాల. మృగరాజుల దగ్గర్నుంచి సరీసృపాల దాకా.. కీటకాల నుంచి పక్షుల దాకా.. ఎన్నో రకాల మూగజీవాలకు సంరక్షణ కేంద్రంగా దేశంలోనే ఉత్తమస్థానంలో నిలుస్తోంది. నిర్వహణలో ఇతర రాష్ట్రాల జంతు ప్రదర్శనశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది.
కుటుంబ సభ్యులతో మమేకం
దత్తత తీసుకున్న వారు వాటికి పేర్లు పెట్టి.. కుటుంబ సభ్యుల్లా వరుస కట్టి వాటితో బంధం పెంచుకుంటున్నారు. ఇక్కడున్న ఓ ఏనుగు పేరు వనజ, ఓ ఖడ్గమృగం పేరు రాము, ఇంకోదాని పేరు విజయ్, బద్రి, కవి అనేవి పులుల పేర్లు.. మరో కోతి పేరు శశి.. ఈ జంతు సంరక్షణ కేంద్రంలోని ప్రత్యేక జంతుజీవాలన్నింటికీ ఓ పేరుంటుంది. వాటి పుట్టిన తేదీ, వచ్చిన రోజు, జాతి తదితర అంశాలను పరిశీలించి వీటికి పేర్లను పెడుతున్నారు.
పక్క రాష్ట్ర ప్రజల ప్రశంసలు
మహారాష్ట్ర జంతు ప్రదర్శన అథారిటీ నుంచి డైరెక్టర్లు, వెటర్నరీ అధికారులు నెలరోజుల క్రితం నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. పార్కు సదుపాయాలపై అథారిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. జంతు ఆవరణలు, రాత్రి ఆవరణలు, సఫారీ పార్కు, మౌస్ డీర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్, రాబందుల సంరక్షణ మొదలైనవాటిని సందర్శించి దత్తత తీసుకునే పద్ధతి, పార్కు నిర్వహణ తీరును ప్రశంసించారు.
జంతువుల సంరక్షణ - దత్తత
- నగరంలోని భారతీయ విద్యాభవన్ శశి అనే కోతిని దత్తత తీసుకుంది.
- ఎస్‌బీఐ బ్యాంకు కొన్నేళ్ల నుంచి ఇక్కడున్న పులుల సంరక్షణకు నిధులు అందిస్తోంది. నగరంలో చాలా విద్యాసంస్థలు ఇందులో భాగమవుతున్నాయి.
- పుణెకి చెందిన ఓ ఐటీ ఉద్యోగి ఇటీవలె నగరానికి బదిలీ అయ్యారు. జంతుప్రేమికుడిగా ఉన్న అతడు ఇక్కడి జూపార్కు నిర్వహణ నచ్చి దత్తతకు ముందుకొచ్చారు.
- నగరానికే చెందిన ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు తన రిటైర్మెంట్ సొమ్ముని జంతువుల సంరక్షణకు అందిస్తున్నారు.
- ఇలాంటి వారి సంఖ్య ఈ ఏడాది 30కి దాటింది.