Youngmen Attack on Young Woman with Stick : నేటి ఆధునిక సమాజంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచే చాలా మందికి మద్యపానం అలవాటుగా మారుతోంది. చిన్న చిన్న వేడుకలు, పార్టీలతో సరదాగా మొదలై.. ఆ తర్వాత సామాజిక మర్యాదగా మారి, చివరికి వీడని వ్యసనంగా మారుతోంది. దాంతో సామాజిక బంధాల్ని, కుటుంబ సభ్యులతో అనుబంధాల్ని సరిగా ప్రదర్శించలేకపోతున్నారు. ముఖ్యంగా యువతలో ఆ మత్తులో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇలాంటి ఘటనలు శృతి మించిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మద్యం మత్తులో కొందరు యువకులు బైక్‌పై వెళ్తున్న ఓ యువతిపై దాడికి పాల్పడడమే కాకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా.. ఖమ్మం జిల్లాకు చెందిన 21 సంవత్సరాల ఓ యువతి అడ్డగుట్ట సొసైటీలోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. అయితే వీకెండ్ కావడంతో శనివారం ఆ యువతి తన తోటి స్నేహితులతో కలిసి బిర్యానీ తిందామని అలా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని బిర్యానీ వాలాకు వెళ్లేందుకు మూడు బైక్‌లపై ఆరుగురు బయలుదేరారు. ఆ యువతి ఒక ద్విచక్రవాహనం వెనుక కూర్చుంది. ఈ క్రమంలో వారు లొకేషన్ పెట్టుకొని వారు వెళ్లాల్సిన చోటుకి జీపీఎస్ ఆన్ చేశారు. బేగంపేట వైపు నుంచి బంజారాహిల్స్‌కు వెళ్తుండగా పంజాగుట్ట కూడలి దాటగానే జీపీఎస్ పంజాగుట్ట శ్మశానవాటికపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిపై నుంచి వెళ్లాలని చూపించింది.
జీపీఎస్ తప్పు చూపించడంతో : ఆ మార్గంలో వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు మరో ద్విచక్రవాహనంపై వెళ్తూ ఆ యువతిని దుర్భాషలాడారు. ఈ క్రమంలో ఆ ఆకతాయిలను దాటుకొని ముందుకు వెళ్లగా ఆ వైపు నుంచి దారి లేకపోవడంతో(జీపీఎస్ తప్పు చూపించడంతో) తిరిగి వెనక్కి వస్తున్నారు. అలా వెనక్కి వస్తున్న క్రమంలో అంతకుముందు దుర్భాషలాడిన యువకుల్లో ఒకరు యువతిపై కర్రతో దాడికి పాల్పడ్డారు. ఇంకో వ్యక్తి యువతి జుట్టు పట్టుకొని లాగడంతో బైక్‌పై వెళ్తున్న ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. అలానే యువతి జుట్టు పట్టుకొని ఆకతాయి కొంతదూరం లాకెళ్లాడు. యువతి స్నేహితులు వెంటనే అప్రమత్తమై మద్యం మత్తులో ఉన్న వారిని పట్టుకొని దగ్గరలోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. ఆ యువకులు పంజాగుట్టకు చెందిన కొండ గోపి, పోచమ్మబస్తీకి చెందిన పుణ్యసాయి కల్యాణ్‌గా గుర్తించారు.
అయితే అసలు విషయం ఏమిటంటే.. ఆ ఆకతాయిలకు అంతకుముందే మరో యువతితో గొడవ జరగడం, కొద్ది సమయం తరువాత అదే దారిలో వచ్చిన ఈమెను చూసి వారు అంతకుముందు గొడవపడిన యువతిగా భావించి.. దాడి చేసినట్లు నిందితులు విచారణలో పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: