హైదరాబాద్‌లో తుపాకీతో కాల్చుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలో నివసించే ఫైజాన్ అహ్మద్... ఓ కన్సల్టెన్సీ సంస్థ నిర్వహించేవాడు. గత అక్టోబరులో సాగర్ సొసైటీలోని ఫోర్ వీల్స్ ట్రావెల్స్ అనే సంస్థ నుంచి బెంజ్ కారు అద్దెకు తీసుకున్నాడు. ప్రతినెల అద్దె చెల్లిస్తున్నాడు.
ఎందుకీ బలవన్మరణం?
బెంజ్ కారులో ప్రయాణిస్తూ... గచ్చిబౌలి వెళ్లే మార్గంలో బాహ్యవలయ రహదారిపై తుపాకీతో కాల్చుకున్నాడు. ఓఆర్ఆర్పై కారు నిలిచి ఉండటాన్ని గమనించిన పెట్రోలింగ్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనం అక్కడి నుంచి తొలగించాలని కోరారు. కారులో నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి దగ్గరకు వెళ్లి చూస్తే... ఫైజాన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించారు.
ఆర్థిక ఇబ్బందులే కారణామా?
ఫైజాన్ అహ్మద్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు ప్రాథమికంగా తేల్చారు పోలీసులు. ఆర్ధిక ఇబ్బందులు, అప్పుల బాధతోనే బలవన్మరణం పొందినట్టు భావిస్తున్నారు. స్నేహితులు, బంధువులను ప్రశ్నిస్తున్నారు.
తుపాకి ఎక్కడిది?
ఫైజాన్ వద్ద తుపాకీ ఎక్కడ నుంచి వచ్చింది? లైసెన్స్ కలిగి ఉన్నాడా? లేదా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఫైజాన్ గచ్చిబౌలి వద్ద టోల్ రుసుం చెల్లించి బాహ్యవలయ రహదారి మీదగా వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటినీ పోలీసులు పరిశీలించారు.
ఫైజాన్ ఆత్మహత్యకు యత్నించడానికి ఆర్థిక ఇబ్బందులే కారణామా? ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి: క్రికెట్లో జోక్యం చేసుకునేది లేదు: సుప్రీంకోర్టు