YCP MLA Krishna Prasad Sensational comments : ''సేవను రాజకీయ కారణాలతో విమర్శించడం మంచి పద్ధతి కాదు. కొంత మంది వ్యక్తులు ఎన్నారైలను వారి పనులు వారు చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఎన్నారైలను భయపెడితే ఎలా..?'' అని ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇలాగైతే వారు సేవా కార్యక్రమాలెలా చేస్తారని ప్రశ్నించారు. ప్రవాసులతో దేశంలో చాలా అభివృద్ధి జరుగుతోందని వివరించారు. ప్రవాసుల సాయాన్ని ఆపాలనుకోవటం అవివేకమవుతోందని పేర్కొన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రవాస భారతీయుడు, ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్ మంచి వ్యక్తి అని, తనకు చాలాకాలంగా స్నేహితుడని తెలిపారు. గుంటూరులో రాజకీయ వేదికపైకి వచ్చారనే ఉద్దేశంతో కావాలని శ్రీనివాస్‌పై ఉన్నవి, లేనివి కల్పించి చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గతంలో చాలా మంది దుస్తుల పంపిణీ తదితర అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారని పేర్కొన్నారు.
"ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాస్..మంచి మనిషి.పేదలకు అండగా ఉన్నారు. పేదల పట్ల ఆయనకు చాలా అభిమానం ఉంది. అందుకే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోయి అవస్థల పాలయ్యారు. అంతేగాని ప్రజలకు కష్టం కలగాలని ఎవరూ కోరుకోరు." -వైసీపీ ఎమ్మెల్యే, వసంత కృష్ణ ప్రసాద్
గుంటూరు సంఘటన అనంతరం ఎన్నారైలకు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత ఇలా మాట్లాడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోపక్క గుంటూరు ఘటనను అడ్డుపెట్టుకుని.. అధికార పార్టీ, టీడీపీని ఇరుకునపెట్టేందుకు విపరీతంగా ప్రయత్నాలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ సభ్యుడే ప్రభుత్వ చర్యలను తప్పుబడుతున్నట్లు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి