World Telugu Writers Fifth Conference : 'స్వభాషను రక్షించుకుందాం.. స్వాభిమానం పెంచుకుందాం' నినాదంతో ఏపీలోని విజయవాడ సిద్ధార్థ అకాడమీలో ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు లాంఛనంగా ఆరంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలను మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, వివిధ సంఘాల ప్రతినిధులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కోటి మాటల కోట, రాజరాజ నరేంద్ర పుస్తకాలను ఆవిష్కరించారు. రచనల ద్వారానే భాషా సంస్కృతులు భవిష్యత్ తరాలకు చేరతాయన్న వెంకయ్యనాయుడు.. మాతృభాషను కాపాడుకునేందుకు ఐదు అంశాలపై అంతా దృష్టి సారించాలని అన్నారు.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో మక్కువ పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపైనా ఉందన్నారు. భాషాభిమానం విషయంలో తమిళనాడును చూసి తెలుగువారు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. సుసంపన్నమైన తెలుగు భాషను విదేశీయులు ఎంతో ఆదరిస్తున్నా.. స్వరాష్ట్రంలో ఆదరణ తగ్గిపోతుండడం పట్ల భాషాభిమానులు ఆవేదన చెందారు.
కన్నతల్లిని గౌరవించినట్లుగానే మాతృభాషపై మమకారం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన సుప్రసిద్ద తెలుగు రచయితలు ఈ మహాసభల్లో పాల్గొని కీలక ఉపన్యాసాలు ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన వారందరికీ గమ్యం-గమనం పేరిట పరిశోధనా గ్రంథాన్ని ప్రతినిధులు అందజేశారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఇవీ చదవండి: