మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా లభించే కోడిగుడ్డును ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని... అంతర్జాతీయ ఎగ్ కమిషన్ వైస్‌ఛైర్మన్ సురేశ్రాయుడు చిట్టూరి అన్నారు. అంతర్జాతీయ ఎగ్ డేను పురస్కరించుకొని హైదరాబాద్ యూసుఫ్‌గూడ మొదటి పటాలం ప్రాంగణంలోని మంజీరాహాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, బెటాలియన్ అదనపు కమాండెంట్‌లు, అధికారులు, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కోడిగుడ్లను తీసుకోవచ్చని, పోషకాలు ఎక్కువగా ఉండే గుడ్డును తింటే ఎదిగే పిల్లలకు ఎంతగానో దోహదపడుతుందని సురేష్ రాయుడు చిట్టూరి తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య పరంగా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం వెనుకబడి ఉందని... త్వరలోనే దీనిని అధికమిస్తామని ఆయన ధీమావ్యక్తం చేశారు. 'ప్రతి రోజు ఒక యాపిల్‌ను తింటే వైద్యుడి దగ్గరకి వెళ్లే అవసరం ఉండదనేది పాత సామెత అని... పోషక విలువలు ఎక్కువగా ఉన్న గుడ్డును ప్రతి రోజు తీసుకుంటే ఆసుపత్రి గడప తొక్కే అవసరం ఉండదనేది నేటి సామెత' అని మొదటి పాటాలం కమాండెంట్ రమేష్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు.
ఇదీ చూడండి: 'అన్ని సౌకర్యాలతో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం'