మూడేళ్ల ప్రాయంలోనే 35 దేశాలు, రాష్ట్రాలు, రాజధానుల పేర్లు చెప్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఈ బుడతడు. తనకున్న చిన్నపాటి మేధస్సును ఉపయోగించి పెద్ద విజయాలు సాధించేందుకు ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటున్నాడు. నాన్న నారాయణని ఆదర్శంగా తీసుకుంటూ, తల్లి ప్రియాంక సహకారంతో... తండ్రి సాధించిన రికార్డులకు తానేమీ తక్కువ కాదన్నట్లు పసిప్రాయం నుంచే రికార్డుల వేటలో పడ్డాడు ఈ పసివాడు. చదువుతోపాటు రోజు ఒక గంట సేపు మెమోరీ ట్రైనింగ్ సంస్థలో శిక్షణ పొందుతూ ఔరా అనిపిస్తున్నాడు హైదరాబాద్కు చెందిన దేవాన్ష్.
బోయిన్పల్లిలోని బైసన్ ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్లో నర్సరీ చదువుతున్న దేవాన్ష్ తక్కువ కాల వ్యవధిలో 113 అంశాలకు సమాధానం చెప్తాడు. 35 దేశాలు, 25 దేశాల జాతీయ పతాకాలు, మన దేశంలోని రాష్ట్ర రాజధానులు, చారిత్రక కట్టడాల పేర్లును అలవోకగా చెప్పేస్తూ... తెలంగాణ బుక్స్ ఆఫ్ రికార్డ్స్, సూపర్ కిడ్స్ రికార్డుల్లో చోటు సాధించుకున్నాడు. దేవాన్ష్ తండ్రి నారాయణ కూడా గణిత శాస్త్రంలో ఎన్నో రికార్డులు సాధించాడు.
14 నెలల పిల్లల నుంచి ఏడేళ్ల చిన్నారులకు తాము మెమోరీ ట్రైనింగ్ ఇస్తున్నామని ఇంప్రూవ్ సంస్థ వ్యవస్థాపకుడు కరణ్ తెలిపారు. మొట్టమొదటగా దేవాన్ష్కు జ్ఞాపకశక్తి శిక్షణ ఇచ్చి సఫలీకృతం అయ్యామని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 40 మంది విద్యార్థులకు రోజుకు కేవలం గంటపాటు పిక్టోగ్రఫీ విధానం ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పిల్లలలో జ్ఞాపకశక్తి పెంచడమే ఇంప్రూవ్ సంస్థ ప్రధాన ఉద్దేశమని ఇంప్రూవ్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి: 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె తల్లీ'