హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో తెరవెనుక అనే సినిమా ఆడియో విడుదల వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళా పోలీసుల సంఖ్య వచ్చే పదేళ్లలో 30 శాతం పెరగాలని ఆమె ఆకాంక్షించారు. ప్రస్తుతం మహిళా పోలీసుల సంఖ్య 7 శాతం మాత్రమే ఉందని పేర్కొన్న సుమతి... పోలీసు శాఖలోకి యువతులు రావాలని కోరారు.
రాష్ట్రంలోని 4 వేల 800 మంది మహిళా సిబ్బందితో డీజీపీ మహేందర్ రెడ్డి "ఆమె పోలీసైతే- మా ప్రతి పథం ప్రగతి రథం" పేరుతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారని చెప్పారు. అయితే స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లైనా పోలీసులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం పోలేదని.. పోలీసు శాఖలో మహిళల సంఖ్య పెరిగితే తప్పకుండా మార్పు సాధ్యమవుతుందని సుమతి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కొవిడ్ ఎఫెక్ట్ : వ్యక్తిగత వాహనాలవైపే ప్రజల మొగ్గు!