ప్రాచీన కాలం నుంచి ఎందరో మహనీయులను, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన కశ్మీర్ ప్రకృతి అందాలు.. ప్రస్తుతం ప్లాస్టిక్ మయంగా మారాయి. ముఖ్యంగా శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ప్లాస్టిస్ వ్యర్థాలు.., చెత్త చెదారాలతో అందవిహీనంగా తయారైంది. అది చూసి చలించిపోయిన.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మహిళా పర్యాటకుల బృందం.. దాల్ సరస్సును శుభ్రపరచే బాధ్యతను తమ భూజాలపై వేసుకుంది. విదేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో అనుసరించే విధానాలనే ఇక్కడ కూడా పాటించాలని పర్యాటకులకు సూచిస్తోంది.
వైద్యులు, ఇంజినీర్లు, విద్యావంతులతో కూడిన.. ఈ బృందం క్లీనింగ్ డ్రైవ్ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సరస్సులోని చెత్త చెదారాలను తీసి పారేసి సరస్సుకు పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తోంది. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే కశ్మీర్‌ను ప్రతి ఒక్కరం.. అందంగా ఉంచేందుకు కృషి చేయాలని మహిళలు పిలుపునిస్తున్నారు. పునర్వినియోగ ప్లాస్టిక్‌ను మాత్రమే పర్యాటకులు వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా బృందం సూచిస్తోంది.
''ఆహారం, ఇతర వ్యర్థాలను సరస్సులో వేయకుండా ఒక బ్యాగులో వేసుకొని చెత్తబుట్టలో పడేయాలి. సుందరమైన ప్రదేశాన్ని చూస్తున్నప్పుడు వ్యర్థాలు కనిపిస్తే మంచిగా అనిపించదు. మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్లాసిక్ లేని వాటర్ బాటిల్, చేతి రుమాలు ఉపయోగిస్తున్నాం. షాంపులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు తీసుకురాలేదు. ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. వారికి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసు. ప్లాస్టిక్ వాడవద్దు. పునర్‌వినియోగం కలిగి వాటినే వాడాలి. ఒకసారి వాడి పారిసే వాటిని విడనాడాలి.''-మాధవి, మహిళా పర్యాటకురాలు
దాల్ సరస్సు మాత్రమే కాక.. గుల్‌మార్గ్, సోన్‌మార్గ్, దూద్‌పత్రి ప్రాంతాలను సైతం శుభ్రపరచనున్నట్లు మహిళలు చెప్పారు. తద్వారా కాలుష్య రహిత కశ్మీరానికి పిలుపు ఇవ్వనున్నట్లు తెలుగు మహిళలు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: