Women MLAs From Greater Hyderabad : జనాభాలో సగం మహిళలే. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థితిలో నారీమణులు ఉన్నా.. శాసనసభలో (Legislative Assembly) వారి ప్రాతినిధ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. 1952లో నియోజకవర్గాలు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కేవలం 10 మంది మహిళలు మాత్రమే శాసనసభలో అడుగుపెట్టారు. పలు నియోజకవర్గాల్లో వారు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో దిగినా అంతగా ప్రభావాన్ని చూపలేకపోయారు.
చట్టసభలో మహిళలకు దక్కని అవకాశం - తెలంగాణ ఎన్నికలో మహిళలకు ఎన్ని సీట్లో తెలుసా?
మేడ్చల్ నియోజకవర్గం 1967, 1972 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్‌డ్‌గా కేటాయించారు. రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సుమిత్రాదేవీ విజయం సాధించారు.
ముషీరాబాద్‌లో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకే ఒక్క మహిళ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని నర్సింహారెడ్డి.. 2008లో రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టి.అంజయ్య సతీమణి మణెమ్మ విజయం సాధించారు. ఆ తర్వాతి ఎన్నికలోనూ ఆమె విజయకేతనం ఎగరేశారు.
1962లో చేవెళ్ల నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకూ 14 సార్లు ఎన్నికలు నిర్వహించారు. 1999 ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) భర్త పటోళ్ల ఇంద్రారెడ్డి గెలుపొందారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో జరిగిన ఉపఎన్నికల్లో సబిత రాజకీయాల్లోకి ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో 10,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గం రిజర్వ్‌డ్ కావడంతో.. 2009లో ఏర్పడిన మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబిత పోటీ చేసి ప్రత్యర్థి తీగల కృష్ణారెడ్డిపై విజయకేతనం ఎగరవేశారు. 2018లోనూ ఆమె గెలిచారు.
ఇబ్రహీంపట్నం నుంచి 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కొండ్రు పుష్పలీల.. కాంగ్రెస్ అభ్యర్థి ఎ.గంగారాం కృష్ణపై విజయం సాధించారు.
2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జయసుధ.. సమీప అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై విజయం సాధించారు.
మలక్‌పేట నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన బి.సరోజినీ పుల్లారెడ్డి గెలిచారు.
సనత్‌నగర్ నియోజకవర్గానికి 11 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కాట్రగడ్డ ప్రసూన.. కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు.
- 1972లో గగన్‌మహల్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీచేసిన టి.శాంతాబాయి.. 5,000ల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
- కంటోన్మెంట్‌లో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967లో ఈ స్థానం నుంచి వి.రామారావు గెలుపొందారు. ఆయన మరణించడంతో 1969లో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన భార్య వి.మంకమ్మ కాంగ్రెస్ తరఫున బరిలో దిగి గెలిచారు. 1972 ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగరవేశారు.
- 1952 శాలిబండ, 1957 పత్తర్‌ఘట్టి నియోజకవర్గాల్లో మసూమా బేగం హస్తం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.