కరోనా కారణంగా కళాశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ ఎత్తేసినా విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోకపోవడంతో... ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యువతీ యువకులు డ్రైవింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. గృహిణిలు, ఉద్యోగం చేసే మహిళలు సైతం డ్రైవింగ్ నేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. పని చేసే ప్రదేశానికి చేరుకునేందుకు ఇన్నాళ్లూ బస్సులు, రైళ్లను ఆశ్రయించిన వారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగినులు, కళాశాలకు వెళ్లే యువతులే కాదు.. గృహిణిలు కూడా డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఇష్టపడుతున్నారని ఉప్పల్‌కు చెందిన ఓ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకురాలు తెలిపారు. గతంలో తమ డ్రైవింగ్ స్కూల్‌కు నెలకు 4-5 మంది మహిళలు రావడమే గొప్ప, ప్రస్తుతం నెలకు 50-80 మంది వస్తున్నారని ఆమె తెలిపారు. మధ్య తరగతి యువతులు, మహిళలు ఎక్కువగా ద్విచక్ర వాహనాల డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ.30-40 వేల సంపాదన ఉండే వారు మాత్రం కార్లవైపు మొగ్గు చూపుతున్నారు. కొందరు ఉపాధి కోసం శిక్షణ తీసుకుంటున్నారు. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే మహిళలు కూడా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు.
లాక్‌డౌన్ కాలంలో సొంత వాహనాల్లో వెళ్లాలనుకునేవారి సంఖ్య పెరిగిందని రవాణా శాఖ సంయుక్త కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. అందులో మహిళల శాతం పెరిగిందని పేర్కొన్నారు. వారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అయితే డ్రైవింగ్ నేర్చుకునే వారు ట్రాఫిక్ నిబంధనలు కూడా తెలుసుకోవాలని పాండురంగ నాయక్ కోరారు. థియరీ తరగతులు, సిమ్యులేటర్లు ఉన్న డ్రైవింగ్ స్కూళ్లను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..
గతంలో డ్రైవింగ్ నేర్చుకునే వారిలో మహిళల సంఖ్య తక్కువగా ఉండేది. కానీ కరోనా తర్వాత ఆ సంఖ్య రెట్టింపైందని శిక్షకులు చెబుతున్నారు. కరోనా ముందు ఒక బ్యాచ్‌లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉండేవారని... కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరిగి ఐదు నుంచి ఎనిమిదికి చేరిందని డ్రైవింగ్ స్కూలు నిర్వాహకులు చెబుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మహిళలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని డ్రైవింగ్ శిక్షణా సంస్థలు రద్దీగా మారాయి. గతం కంటే ఎక్కువ మంది వస్తుండటంతో ఖాళీ సమయం ఉండటం లేదని శిక్షకులు చెబుతున్నారు.
రెట్టింపైంది..
కరోనా కంటే ముందు ద్విచక్రవాహనాల వాడకం అధికంగానే ఉన్నా.. కొవిడ్ తర్వాత కార్ల వినియోగం రెట్టింపైంది. డ్రైవింగ్ నేర్చుకున్న వారిలో అధిక శాతం మంది కొత్త లేదా పాత కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో విక్రయాల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ వల్ల కొన్ని నెలలు షోరూమ్‌లు మూసి ఉంచినప్పటికీ ప్రస్తుతం విక్రయాలు ఊపందుకున్నాయి. ప్రస్తుత ఉత్పత్తిని మించి ఆర్డర్లు వస్తున్నాయని షోరూమ్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: JNTUH Golden Jubilee: ఆ బాస్‌లు అందరూ.. ఒకప్పుడు జేఎన్‌టీయూ విద్యార్థులేనని మీకు తెలుసా?