Woman Lives in a Car: హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని మధురానగర్‌లో మినీవ్యాన్‌లో నెలల తరబడిగా నివాసముంటున్న అనితను పోలీసులు సఖి కేంద్రానికి తరలించారు. గత ఏడాది జులై నుంచి మినీవ్యాన్‌లోనే ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు.. సర్దిచెప్పి గోపాలపురం సఖి కేంద్రానికి తీసుకెళ్లారు. మధురానగర్‌లోని ఓ వసతిగృహంలో మూడేళ్ల పాటు ఉన్న అనిత.... పరిస్థితులు అనుకూలించటంలేదంటూ మినీవ్యానులోనే నివాసాన్ని మార్చుకుంది. ఓ స్థిరాస్తి సంస్థలో ఉద్యోగం చేస్తూ తన వాహనంలోనే ఉంటున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది.
ప్రశ్నించినందుకే ఖాళీ చేయించారు.. మధురానగర్‌లోని రాజ్ దూత్ వసతిగృహంలో దాదాపు మూడేళ్ల పాటు ఉన్న అనిత, ఆ తర్వాత వసతిగృహానికి ఎదురుగా మినీ వ్యానులోకి తన నివాసాన్ని మార్చుకుంది. రాజ్‌దూత్ వసతిగృహ నిర్వాహకులు నెలకు 6వేల రూపాయలు అడుగుతున్నారని.. సరైన భోజనం పెట్టకుండా ఇబ్బంది పెడుతుంటే ప్రశ్నినందుకే వసతిగృహం నుంచి ఖాళీ చేయించారని అనిత ఎస్.ఆర్ నగర్ పోలీసులకు వివరించింది. వర్షాకాలం, చలికాలం వ్యానులో ఇబ్బందులు పడలేదా అని పోలీసులు అడిగితే మౌనంగా ఉండిపోయింది. ఎండాకాలం వల్ల గత నెల రోజులుగా వ్యానులో ఉక్కపోతగా ఉండటంతో ఉదయం నుంచి రాత్రి వరకు చుట్టుపక్కల చెట్ల కింద, అపార్ట్ మెంట్ కింద ఉండి రాత్రి వేళలో వ్యానులో వచ్చి నిద్రపోయినట్లు అనిత పోలీసులకు తెలిపింది. కొన్ని రోజుల క్రితం తన వ్యానును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టడంతో డోర్లు పాడైపోయాయని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.
స్థిరాస్తి సంస్థలో ఉద్యోగం చేస్తూ.. చుట్టుపక్కల వాళ్లు అభ్యంతరం చెబుతున్నారని పోలీసులు అనిత వద్ద ప్రస్తావిస్తే... నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో... నన్ను ఎవరు ఎందుకంటారని ప్రశ్నించింది. తన తల్లిదండ్రులు మెహదీపట్నంలో ఉండేవాళ్లని.. వాళ్లు చనిపోయిన తర్వాత అక్క ఇంట్లో, అన్న ఇంట్లో కొన్నేళ్లు ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. వాళ్ల వివాహాలు అయిన తర్వాత ఇంట్లో నుంచి వచ్చేసి.. పంజాగుట్టలోని ఓ స్థిరాస్తి సంస్థలో ఉద్యోగం చేస్తూ రాజ్‌దూత్ వసతి గృహంలో ఉంటున్నట్లు తెలిపింది. తన మారుతి వ్యాన్‌ను వసతిగృహం ముందు అనిత పార్కు చేసి ఉంచింది. మారుతి వ్యానును ఎటు తీయకపోవడంతో మరమ్మతులకు గురైంది. రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానికులు వ్యాన్‌ను నాలా పక్కన రహదారిపైకి మార్చారు.
ఓ వ్యక్తిని ప్రేమించి మోసపోయి.. అనిత అద్దె సరైన సమయానికి చెల్లించకపోవడంతో పాటు శుభ్రత పాటించకుండా తోటి వాళ్లకు ఇబ్బంది కలుగజేయడంతో పంపించేసినట్లు వసతిగృహ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. తాను ఓ వ్యక్తిని ప్రేమించి మోసపోయానని, అందుకే ఎవరినీ వివాహం చేసుకోకుండా ఉండిపోయినట్లు అనిత, పోలీసులకు వివరించింది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన 10 లక్షల రూపాయల్లో 6లక్షలను తన సోదరుడు మధుసూదన్‌కు ఇచ్చానని.. నెలకు 10వేల రూపాయలను తన సోదరుడు ఖాతాలో జమ చేస్తాడని అనిత పోలీసులకు వివరించింది. అంతేకాకుండా తన ఖాతాలో మరో 4లక్షల రూపాయలు కూడా ఉన్నట్లు తెలిపింది. వసతిగృహం సమీపంలో ఉండే అపార్టుమెంట్ సెక్యూరిటీ గార్డు భార్య సాయంతో వారి స్నానాల గదిలో కాలకృత్యాలు తీర్చుకొని, రాత్రి వేళల్లో మారుతి వ్యానులో అనిత నిద్రపోతోంది.
ఆటోడ్రైవర్లు వెంట రావాలని ఇబ్బంది పెట్టారు.. తన వద్ద ఉన్న డబ్బులతో హోటళ్ల నుంచి అల్పాహారం, భోజనం తెచ్చుకొని తింటున్నట్లు పోలీసులకు తెలిపింది. ఓసారి తన సోదరుడు చనిపోయినట్లు అనిత పోలీసులకు తెలిపింది. 8 నెలలుగా వ్యానులో ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మధ్యలో రెండుమూడు సార్లు ఆమెకు నచ్చజెప్పారు. వేరే వసతిగృహంలోకి వెళ్లాలని లేకపోతే.. ఆశ్రమాల్లోనైనా చేరాలని సూచించినా.. అనిత మొండిగా వ్యవహరించడంతో పోలీసులు పట్టించుకోలేదు. ఒకరిద్దరు ఆటోడ్రైవర్లు వెంట రావాలని ఇబ్బంది పెట్టినట్లుగా కూడా అనిత పోలీసుల వద్ద తెలిపింది. చుట్టుపక్కల వాళ్లందరికీ తాను తెలుసని, అందుకే వ్యానులో నివాసం ఉంటున్నా తనను ఎవరూ ప్రశ్నించేవాళ్లు కాదని అనిత పోలీసులకు తెలిపింది.
అనిత మానసిక పరిస్థితి సరిగాలేదని.. వేరే వసతిగృహంలో వెళ్లి ఉండమని పోలీసులు సూచిస్తే.. నేనే సొంతంగా ఒక వసతిగృహం ఏర్పాటు చేస్తానని అనిత పోలీసులకు సమాధానమిచ్చింది. అనిత మానసిక స్థితి సరిగ్గాలేదని, అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధితోనూ బాధపడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: