సంగారెడ్డి జిల్లా జోగిపేట్కు చెందిన మాధురికి ఇంటర్మీడియట్ కాగానే పెళ్లిచేశారు. మాధురి దంపతులు పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. వారికి ఇద్దరు మగపిల్లలు అరవింద్, ఆకాశ్ పుట్టారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో.. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న తగాదాలు మొదలయ్యాయి. చినుకుచినుకు గాలి వానలా మారినట్లు చిన్న గొడవలు వివాదాలకు దారితీశాయి. మనస్పర్థలతో కలిసి ఉండలేక ఇద్దరు విడిపోయారు.
ఆటో నడపాలని..
భర్తతో విడిపోయిన మాధురిపై కుటుంబ పోషణ భారం పడింది. తల్లి, ఇద్దరు పిల్లల్ని తానే చూసుకోవాలి. ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని భావించి.. డైమండ్లు తయారు చేసే సంస్థలో కట్టర్‌గా చేరింది. కొన్నాళ్లకు ఆ ఉద్యోగాన్ని వదిలి.. తన పెళ్లి సమయంలో భర్తకు కట్నం కింద కొనిచ్చిన ఆటో నడపాల(Lady auto Driver)ని నిర్ణయించుకుంది.
ఎవరేమన్నా పర్లేదు..
మగవాళ్లు మాత్రమే ఉండే ఆటో డ్రైవింగ్ రంగంలో అడుగుపెట్టడమంటే మామూలు విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆటో డ్రైవింగ్ వద్దని మొదట్లో తన తల్లి వారించింది. అయినా వినకుండా.. ఎవరేమనుకున్నా పర్లేదని.. కుటుంబమే తనకు ముఖ్యమని ఆ రంగంలోకి అడుగుపెట్టింది. ఆటో డ్రైవింగ్(Lady auto Driver)లో నిలదొక్కుకునేందుకు మాధురి అనేక అవాంతరాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. తన పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడమే ముఖ్యమని ముందుకు సాగుతోంది.
సాయం చేయండి..
" ఆటో నడపగా వచ్చిన డబ్బును నా కొడుకుల చదువులు, ఇంటి ఖర్చు కోసం ఉపయోగిస్తున్నాను. ప్రస్తుతం నా పెద్ద కొడుకు అరవింద్ 8వ తరగతి, చిన్న కుమారుడు ఆకాశ్ 3వ తరగతి చదువుతున్నాడు. నెలనెల ఇంటి అద్దె చెల్లించాల్సి వస్తుండటంతో సగం డబ్బు దానికే ఖర్చయిపోతోంది. ప్రభుత్వం స్పందించి మాకు రెండు పడకల గదుల ఇళ్లు అందజేయాలి."
- మాధురి, ఆటో డ్రైవర్
మా ఇంటి ఆడబిడ్డగా..
ప్రారంభంలో ఓ మహిళ ఆటో నడపడం తమ యూనియన్‌లో కాస్త కొత్తే అనిపించినా...నెమ్మదినెమ్మదిగా ఆమె కష్టాలు అర్థం చేసుకుని ఆమెను అక్కున చేర్చుకున్నామని ఆటో డ్రైవర్లు తెలిపారు. సవారీ వచ్చినప్పుడు మొదటి ప్రాధాన్యత మాధురికే ఇస్తామని చెప్పారు. ఆమెను తమ ఇంటి ఆడబిడ్డగా చూసుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి : Guru Purnima : గురుపరంపరకు ఆద్యుడు.. వ్యాసభగవానుడు