Local Body Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (Mlc Elections) ప్రక్రియలో ఒక అంకం ఇవాళ పూర్తి కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. ఇందుకు మధ్యాహ్నం మూడు గంటల వరకు సమయం ఉంది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 12 స్థానాలకు ఎన్నికలు (Mlc Elections) జరుగుతున్నాయి. అందులో నాలుగు జిల్లాలకు చెందిన ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.
ఇద్దరు చొప్పున...
నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాత్రమే బరిలో ఉన్నారు. రెండు స్థానాలున్న రంగారెడ్డి, మహబూబ్నగర్ నుంచి కూడా ఇద్దరు చొప్పున మాత్రమే పోటీలో ఉన్నారు. రంగారెడ్డిలో పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు... మహబూబ్నగర్లో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో ఆ నాలుగు జిల్లాల్లో పోలింగ్ (Polling) నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఇవాళ స్పష్టత...
ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వారు మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు. మిగిలిన ఐదు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇవాళ స్పష్టత రానుంది. ఆదిలాబాద్, కరీంనగర్లో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెరాస అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పోటీలో ఉన్నారు. నల్గొండలోనూ తెరాస అభ్యర్థితో పాటు స్వతంత్రులు బరిలో ఉన్నారు. మెదక్, ఖమ్మంలో తెరాస సహా కాంగ్రెస్ అభ్యర్థులు, స్వతంత్రులు పోటీలో ఉన్నారు.
స్వతంత్రులను తప్పించే ప్రయత్నం...
వీలైనంత వరకు స్వతంత్రులను బరిలో నుంచి తప్పించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం తుదిపోటీలో నిలిచే అభ్యర్థుల విషయమై స్పష్టత రానుంది. అవసరమైన చోట పోలింగ్ వచ్చే నెల 10న నిర్వహిస్తారు. అటు రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద నామినేషన్ పత్రాలు చింపిన ఫిర్యాదు విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఆదేశాలు జారీ చేయనుంది.
ఇదీ చూడండి: