హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరుగుతోన్న ఏవియేషన్ ప్రదర్శన మూడోరోజు సభలు, సమావేశాలు, ఎయిర్ షోలతో ముగిసింది. కరోనా భయాలతో ప్రదర్శన నిర్వహణపై సందేహాలు నెలకొన్న వేళ నిర్వాహకులు ప్రదర్శనను నిర్వహించడం సహా విజయవంతం చేశారని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రశంసించారు. ఇందులో భాగస్వామ్యమైన తెలంగాణ ప్రభుత్వం, ఎయిర్ పోర్టు అథారిటీ, ఎంవోసీఏ అధికారులు, ఫిక్కీ ప్రతినిధులను ఆయన అభినందించారు. ప్రయాణికుల సేవల్లో ఉత్తమంగా రాణించిన విమానయాన సంస్థలకు స్వచ్ఛత ప్రమాణాలు పాటిస్తున్న విమానాశ్రయాలకు అవార్డులు అందజేశారు.
20 ఏళ్లలో 2400 ఎయిర్ క్రాఫ్టులు
వైమానిక రంగంలో భారత్కు అపార అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యువతకు శిక్షణ ఇప్పించేందుకు పలు అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వివరించారు. పైలెట్లు, ఎయిర్ క్రాఫ్టు ఇంజినీర్లకు ఉన్న గిరాకీ దృష్ట్యా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 20 ఏళ్లలో భారత్ తన అవసరాల కోసం 2,400 విమానాలు అవసరమని పేర్కొన్నారు.
విమానాశ్రయాల్లో పకడ్బందీ స్క్రీనింగ్ చర్యలు
కరోనా ప్రభావంతో దేశీయ విమానయానం తగ్గిందని.. దీన్ని త్వరితగతిన అధిగమిస్తామని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. అన్ని విమానాశ్రయాల్లో కరోనా నియంత్రణకు పకడ్బందీ స్క్రీనింగ్ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నాలుగు రోజుల పాటు సాగిన ఏవియేషన్ షో ఇవాళ ముగియనుంది.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్