శాసనసభ్యుల కోటా కింద ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మార్చి 21న జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించింది. శాసనసభ్యుల కోటా కింద ఐదుగురు ఎమ్మెల్సీల స్థానాల కోసం ఎన్నిక జరగనుంది. మండలిలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఉండగా వీరి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికవ్వకుంటే మండలిలో హస్తం పార్టీకి ప్రాతినిధ్యం ఉండదు.
21 మంది మద్దతు తప్పనిసరి:
ఇప్పటికే తెరాస తరఫున నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక స్థానాన్ని ఎంఐఎంకు కేటాయించింది. కాంగ్రెస్ కూడా అభ్యర్థిని బరిలో నిలపనుండటంతో మొత్తం ఐదు స్థానాలకు ఆరుగురు పోటీ పడనున్నారు. ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికకు కనీసం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్‌కు 19 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందని, తమ అభ్యర్థి విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు.
ఇవీ చదవండి:ఎవరా ఇద్దరు?
మొత్తం 21 మందికి ఒకరు తగ్గినా కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నిక కష్టమే. తెరాస నలుగురిని బరిలోకి దింపుతుండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటులో తెరాసకు ఆధిక్యం వస్తుందని.. కాంగ్రెస్ అభ్యర్థికి 21 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినా ప్రయోజనం ఉండదని విశ్లేషిస్తున్నారు. తెరాస, ఎంఐఎం వ్యూహాత్మకంగా అయిదుగురిని బరిలో దింపినట్లు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్‌లో పోటీ:
ఒక్క స్థానం వస్తుందని భావిస్తున్న ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్ పార్టీలో భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే 25 మందికి పైగా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఇటీవల పొత్తుల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన నేతలు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, సేవాదళ్ నేత కనుకుల జనార్దనరెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పార్టీ నేతలు వేణుగోపాల్, కుమార్‌రావు, బండ్ల గణేష్ సహా 15 మంది పోటీపడుతున్నారు.
ఇవీ చదవండి:వైకాపాదే విజయం