ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉండాలన్న లక్ష్యంతో కనీస నిల్వ నిబంధన లేకుండా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో జన్‌ధన్ ఖాతాలను కేంద్రం ప్రభుత్వం తెరిపించింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2014 ఆగస్టులో మహిళల ద్వారా ఈ ఖాతాలు తెరిచారు. అంతకంటే ముందే కొన్ని బ్యాంకులు కనీస నిల్వ నిబంధన లేకుండా పేద మహిళలకు ఖాతాలు తెరచుకునే అవకాశం ఇచ్చాయి. చాలా బ్యాంకుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఖాతాలు తెరిచారు. అప్పటికే చాలా మందికి ఖాతాలు ఉండడం వల్ల.. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో మరోసారి ఖాతాలు తెరవకుండా వాటితోనే సరిపెట్టుకున్నారు.
లాక్‌డౌన్ అమలవుతోన్న సమయంలో ఉపాధి కరవై పేదలు ఇబ్బంది పడకుండా.. కేంద్రం జన్‌ధన్ ఖాతాదారులకు మూడు నెలలపాటు రూ.500 చొప్పున జమచేయాలని నిర్ణయించింది. ఆ మేరకు దేశవ్యాప్తంగా ఈనెల మొదటి వారంలో రూ.500 జమ చేసింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు చెందిన 423 శాఖల్లో దాదాపు తొమ్మిది లక్షల ఖాతాల్లో పీఎంజీకేవై-2020 నగదు జమ అయింది.
నగదు జమ అయిన వారం రోజుల తర్వాత పొరపాటును గుర్తించిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు యజమాన్యం.. మూడు లక్షలకు పైగా ఖాతాల నుంచి నగదును వెనక్కి తెప్పించేందుకు చర్యలు తీసుకుంది. ఈలోగా అనర్హులుగా భావిస్తున్న మరో లక్ష మంది ఖాతాదారులు దాదాపు ఐదు కోట్లు మొత్తాన్ని ఉపసంహరించినట్లు అధికారులు గుర్తించారు.
ఇదే మాదిరిగా తమ బ్యాంకుల్లోనూ అనర్హులకు ఏమైనా పీఎంజీకేవై మొత్తాలు జమ అయ్యాయా అన్న కోణంలో ఇతర బ్యాంకులు కూడా ఆరా తీస్తున్నాయి.
ఇవీ చూడండి : ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు: తలసాని