తెలంగాణ భాజపా అధ్యక్ష పదవి ఎంపికపై రాష్ట్ర నేతల నుంచి ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తయ్యింది. ఆర్‌ఎస్‌ఎస్ మినహా పార్టీ సీనియర్లు, పార్టీ అనుబంధ విభాగాలు సైతం మరోసారి లక్ష్మణ్‌ను కొనసాగించాలనే అభిప్రాయాన్ని రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి కృష్ణదాస్ ముందు ఉంచినట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం లక్ష్మణ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు గట్టిగా మద్దతు పలికినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జాతీయ నాయకత్వం సంతృప్తిగానే ఉంది...
లక్ష్మణ్ నాయకత్వం పట్ల జాతీయ నాయకత్వం సంతృప్తికరంగానే ఉంది. అయినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు పార్టీ అనుబంధ విభాగాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. లక్ష్మణ్‌కు జాతీయ పదవితోపాటు రాజ్యసభ సభ్యుడిని చేసే అవకాశం లేకపోలేదని పార్టీలోని జాతీయ స్థాయి కీలక నేత ఒకరు చెప్పారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో నిరాశజనక ఫలితాలు సాధించడం.. దిల్లీ ఎన్నికల ఫలితాలు వంటి అంశాలు లక్ష్మణ్‌కు ఉన్న అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం నెలకొంది.
ఏ క్షణమైనా నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం...
రాష్ట్ర అధ్యక్షుడిని ఈ నెల చివరి కల్లా లేదా మార్చి మొదటివారంలోపే ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 24వ తేదీన పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి అనిల్ జైన్ రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు పార్టీ సీనియర్‌నేతలతో పాటు కోర్‌కమిటీతో సమావేశం అవుతారు. సీనియర్ నేతలు, కోర్‌కమిటీ అభిప్రాయాలను అనిల్ జైన్ జాతీయ నాయకత్వానికి తెలుపనున్నారు. అనంతరం ఏ క్షణమైనా నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది.
పార్టీలో ఎక్కువ మంది లక్ష్మణ్‌నే మరోసారి అధ్యక్షుడిగా ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షులకు సంబంధించి ఆరు జిల్లాల్లో ఏకాభిప్రాయం వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మిగతా వాటిపై ఒకటి, రెండు రోజుల్లో ఏకాభిప్రాయం తీసుకువచ్చి ప్రకటించే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి:సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ బహిరంగ లేఖ