రాష్ట్రంలో సాగురంగం రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించినా... అనుకోని విపత్తుల వల్ల రైతు కష్టం మట్టిపాలవుతోంది. సాగు పెట్టుబడి కోసం రైతుబంధు, కర్షకుడు ఏదైనా కారణం చేత చనిపోతే రైతుబీమా పథకం చేయూతనిస్తున్నా... భారీ వర్షాలతో పంటచేతికి రాకపోతే ఆ నష్టం ఊబిలో నుంచి అన్నదాత బయటపడటం ప్రహాసనంగా మారింది.
కౌలు రైతులకూ...
గతేడాది భారీవర్షాలు, వరద నష్టంపై కేంద్రానికి సమర్పించిన తుది నివేదికలో 5లక్షల 97 వేల హెక్టార్లలో తీవ్ర పంట నష్టం జరగ్గా ఆ విలువ రూ. 7వేల2వందల19 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అసలు నష్టం జరగలేదని హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ప్రస్తావించడం గమనార్హం. కౌలు రైతులకు రైతుబంధు, ఇతర రకాలైన మద్దతు అందట్లేదన్న విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు... పరిహారం కౌలు రైతులకూ అందించాలని ప్రభుత్వానికి సూచించింది.
భరోసా ఇవ్వాలి...
రాష్ట్రంలో 60 లక్షల మంది పట్టాదారులున్నారు. గతంలో పంటల బీమా పథకాలు (Pantala Beema Schem) అమల్లోఉన్నప్పుడు రైతులకు బీమా పక్కాగా వర్తించేది. విపత్తులతో పంటకోల్పోయితే ఈ ఏడాది కాకపోయినా మరో సంవత్సరమైనా పరిహారం వచ్చేది. 2016 ఖరీఫ్ నుంచి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి పంటబీమా పథకం (Prime Minister's Crop Insurance Scheme) అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడం వల్ల ఈ పరిహారం బీమా కంపెనీలు పెండింగ్‌లో పెట్టాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్థానంలో గుజరాత్, ఏపీ తరహాలో కొత్త పంట బీమా పథకంతో రైతులకు భరోసా ఇవ్వాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
వ్యవసాయ శాఖకు ఆదేశాలు...
2020 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతుల వివరాలు 3 నెలల్లోపు సేకరించాలని హైకోర్టు నిర్దేశించింది. నెలలోపులో రైతులకు పెట్టుబడి రాయితీ రూపంలో పరిహారం అందించాలన్న న్యాయస్థానం... సన్న, చిన్నకారు, కౌలు రైతులకు తగిన మొత్తంలో బీమా పరిహారం అదనంగా చెల్లించాలని వ్యవసాయశాఖకు ఆదేశాలిచ్చింది. కేంద్రానికి నష్టం వివరాలు అందించి రైతులను ఆదుకోవాలని కిసాన్ కాంగ్రెస్ సూచించింది. రైతు ప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు తీర్పు మేరకు అన్నదాతలకు బీమా రూపంలో చేయూత ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.
ఇదీ చదవండి: Revanth reddy comments: 'శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించాలంటే కేసీఆర్, కేటీఆర్ అనుమతి కావాలా'