సెప్టెంబర్‌లో జరిగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్రప్రభుత్వం 8 బిల్లులను తీసుకొచ్చింది. అందులో రెండు కొత్తవి కాగా మిగిలిన 6 చట్టసవరణకు చెందినవి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసేలా చట్టం చేసేందుకు సర్కార్ బిల్లు తీసుకొచ్చింది. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీకళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ చట్టం రూపకల్పనకు బిల్లు తీసుకొచ్చింది.
జీఎస్టీకి మాత్రమే ఆమోదం: మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరిస్తూ... బిల్లు తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీ, పురపాలకచట్టాలకు సవరణ చేస్తూ మరో బిల్లును తెచ్చింది. వాటితో పాటు పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం... అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాచట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 13న మొత్తం 8 బిల్లులు ఉభయసభల ఆమోదం పొందాయి. శాసనసభ, మండలి ఆమోదం తర్వాత... గవర్నర్ అనుమతి కోసం రాజ్‌భవన్‌కు పంపారు. అందులో జీఎస్టీ చట్ట సవరణ బిల్లు మాత్రమే ఆమోదం పొంది చట్టంగా రూపుదాల్చింది. మిగిలిన ఏడింటికి ఆమోదం లభించలేదు.
ఇంకా పరిశీలనలోనే ఆ బిల్లులు: అందులో ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. కేంద్రంతో ముడిపడి ఉన్నందున రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. మిగతా ఆరు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లుల విషయమై స్పందించిన... గవర్నర్ తమిళిసై వాటిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుపై... విద్యాశాఖ మంత్రి, అధికారులను పిలిపించి గవర్నర్ తమిళిసై వివరణ తీసుకున్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయకుండా... ప్రైవేట్ వర్సిలు వ్యాపారమా అని ప్రశ్నించిన తమిళిసై... బిల్లుల ఆమోదానికి నిర్ధిష్ట గడువేమీ లేదని వ్యాఖ్యానించారు.
ఆమోదం లభిస్తేనే విధానపర నిర్ణయాలు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం ఆంక్షలపై చర్చించేందుకు... శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల మూడోవారంలో ఉభయసభల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయమై ఏం చేస్తారన్నది చర్చనీయాంశమైంది. గవర్నర్ నుంచి వెనక్కి వస్తే తప్పఉభయసభల్లో చర్చకు ఆస్కారంలేదు. ఇప్పటికే ఆమోదం పొందిన బిల్లులపై మళ్లీ చర్చకు ఆస్కారం లేదని అంటున్నారు. ఐతే శనివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశంకానుంది. వివిధ కీలక విధానపర నిర్ణయాలు అమలుచేయాల్సి ఉన్నందున త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను కోరుతూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అవసరం అనుకుంటే అసెంబ్లీ, మండలిలోనూ బిల్లుల విషయమై చర్చించి తీర్మానం చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
ఇవీ చదవండి: