National Flag What Tell The Students: నేడు స్వాతంత్య్ర దినోత్సవం. అమృత మహోత్సవంలో దేశమంతా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ప్రతి విద్యార్థీ ఆ జెండాకు వందనం చేసేటప్పుడు గుండెలనిండా దేశభక్తిని నింపుకోవడమే కాదు, ఆ జెండా నింపే స్ఫూర్తినీ మనసు నిండా పదిలపరుచుకోవాలి. మెజార్టీ యువత ఉన్న మన దేశంలో.. ప్రతి ఒక్కరికీ ఆ త్రివర్ణ పతాకం చెప్పే జీవితపాఠాలు ఆవశ్యకం. ఇంతకీ విద్యార్థీ జెండా నీకేం చెబుతోంది?
బలం - ధైర్యం: విద్యార్థి దశలో ఉండే ఒత్తిడినీ, ఉద్యోగాన్వేషణలో ఉండే పోటీనీ తట్టుకునేందుకు ఆత్మబలం, మనోధైర్యం కావాలి. జాతీయ జెండాలోని కాషాయరంగు ఆ బలానికి, ధైర్యానికి చిహ్నం. మానసికంగా దృఢంగా ఉంటేనే ఎవరైనా తమ లక్ష్యాలను చేరుకోగలరు. ‘కొత్తగా ఆలోచించేందుకు, ఏదైనా సృష్టించేందుకు, నూతన దారుల్లో పయనించేందుకు, సమస్యలను సాధించేందుకు యువత ఎప్పుడూ వెనుకాడకూడదు’ అంటారు డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం. ఒక పని తీసుకున్నప్పుడు, దాన్ని ప్రయత్నించేటప్పుడు, ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకుని ముందుకెళ్లేటప్పుడు.. ఇలా ప్రతి చోటా మనకు ధైర్యం కావాలి. ఆ స్థైర్యాన్ని మనమే పెంపొందించుకోవాలి.
సుసంపన్నమైన ఆలోచనలు: మెదడు, నేల ఒక్కటే. వాడకుండా వదిలేస్తే రెండూ నిస్సారమైపోతాయి. రైతు నేలను దుక్కిదున్ని, నాట్లేసి, పండించి దేశానికి అన్నం పెట్టినట్టే .. విద్యార్థి తన మెదడుకు పదునుపెట్టి, మంచి మార్కులు సాధించి, కెరియర్‌లో దూసుకెళ్లి, నూతన ఆవిష్కరణలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. సుసంపన్నంగా, సానుకూల దృక్పథంతో ఆలోచించే యువతే.. పచ్చని ఈ దేశానికి వెన్నెముక!
ఏ పని చేసినా సృజనాత్మకంగా ఆలోచించే వారికి అంతిమ ఫలితాలెప్పుడూ ఆశాజనకంగానే ఉంటాయి. మన నైపుణ్యాలకు నిరంతరం పదును పెట్టడం ద్వారా మన జీవితాన్నీ, కుటుంబాన్నీ సుభిక్షంగా ఉంచగలుగుతాం. ఆ పచ్చదనానికి తీసుకోవాల్సిన అర్థమదే.
శాంతి, స్వచ్ఛత: త్రివర్ణ పతాకంలోని తెలుపు రంగు శాంతికి మాత్రమే కాదు, స్వచ్ఛతకు - నిజానికీ ప్రతీక. చదువులో ఎన్ని ర్యాంకులు పొందినా, ఉద్యోగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నిజమైన విజయం మనం పొందే మనశ్శాంతిలోనూ.. మనసు పట్ల మనకున్న నిజాయతీలోనూ ఉంటుంది. ప్రశాంతతను మించిన మానసికస్థితి మరొకటి లేదు. సవాళ్లు ఎదురైనప్పుడు, సమస్యలు కుంగదీసినప్పుడు.. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని, సరైన నిర్ణయాలను తీసుకుని, వాటికి కట్టుబడి ఉండటమే అసలైన శాంతి. ఆ శ్వేతవర్ణాన్ని చూసి మనం సాధన చేయాల్సిందదే!
పురోగతి దిశగా... పయనం: అశోక చక్రంలోని 24 ఆకులకు (స్పోక్స్) ఒక్కోదానికీ ఒక్కో అర్థముంది. వినయం, ఆరోగ్యం, శాంతి, త్యాగం, నైతికత, సేవాగుణం, క్షమాగుణం, ప్రేమ, స్నేహం, సౌభ్రాత్రం, నిర్మాణం, సంక్షేమం, శ్రేయస్సు, శ్రమ, భద్రత, వివేకం, సమానత్వం, ఆర్థికజ్ఞానం, విశ్వాసం, న్యాయం, సహకారం, విధులు, హక్కులు, జ్ఞానం.. ఈ లక్షణాలన్నీ యువత సాధన చేయాల్సినవే. నిత్యం పురోగతివైపే పయనించాలని సూచించే ఆ చక్రం సమయమేదైనా సన్నద్ధత, కృషి ఆగిపోకూడదని చెబుతుంది. రేపటిపై ఆశతో ముందుకెళ్లాలని సూచిస్తుంది.
ఇవీ చదవండి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు