సీతాఫల్మండి డివిజన్లో సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ ప్రజా సమస్యలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ సామల హేమ తెలిపారు. రెండోసారి తనను గెలిపించినందుకు పార్టీ శ్రేణులతోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
గత ఐదేళ్లుగా ప్రజల్లో తిరుగుతూ ప్రతి విషయంలోనూ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అర్హులైన వారికి త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తామని అన్నారు. కరోనా విపత్కర సమయంలో వరద బాధితులను ఆదుకోవడంలో రాత్రింబవళ్లు కష్టపడి సఫలం అయినట్లు తెలిపారు.
ప్రజలకు మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల కల్పనలో తాము కృషి చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పేదల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, రెండు పడక గదుల ఇల్లు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆ పనులు పూర్తైన వెంటనే లబ్ధిదారులకు కేటాయిస్తామని వివరించారు. తన సమీప భాజపా అభ్యర్థి తనకు పోటీ ఇచ్చినప్పటికీ వారి ప్రభావం కనిపించలేదని తెలిపారు.
ఇదీ చూడండి : రైతుబంధు నిధులు, పంపిణీపై సోమవారం సీఎం సమీక్ష