హైదరాబాద్లో రోజుకు దాదాపు రెండున్నర లక్షల మంది ప్రయాణికులు మెట్రో ద్వారా ప్రయాణిస్తున్నారు. మొత్తం 72 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటివరకు 56 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. నగరవ్యాప్తంగా 50 స్టేషన్ల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రాజధాని ప్రాంతం కావటం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వ్యాపారాలతో నిత్యం బిజీబిజీగా ఉండే నగరవాసులతో పాటు.. వేరే పనుల నిమిత్తం నగరానికి వచ్చే వారు విరివిగా మెట్రో సేవలు వినియోగిస్తున్నారు.
నగరవాసి అసహనం..
రద్దీ సమయాల్లో ప్రతి 3 నుంచి 5 నిమిషాలకో మెట్రో నడుపుతోన్న హెచ్ఎంఆర్ఎల్ ఉదయం 6.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు సేవలందిస్తోంది. శని, ఆదివారాల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10.30 వరకే చివరి రైలును నడుపుతోంది. ఆ తర్వాత ప్రయాణించాలనుకునే వారికి మెట్రో సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వేళల్ని పొడిగించండి..
ముఖ్యంగా రాత్రి వేళల్లో పది గంటల తర్వాత ప్రజారవాణా వ్యవస్థ నెమ్మదిస్తుంది. ఆర్టీసీ బస్సులు సరిగా ఉండవు. భద్రత దృష్ట్యా మెట్రో ద్వారా ప్రయాణించాలనుకునే వారికి మొండిచెయ్యే ఎదురువుతోంది. రద్దీ సమయాల్లో రికార్డు స్థాయిలో ప్రయాణికులను చేరవేసే మెట్రో, ఆక్యుపెన్సీ కారణంతో రాత్రిళ్లు వెంటనే స్టేషన్ షటర్ మూసివేస్తున్నారు. మెట్రో సమయాల్ని పెంచాలని చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. హెచ్ఎంఆర్ఎల్ పొడిగిస్తామని చెబుతున్నా.. ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ప్రజాశ్రేయస్సు, భద్రత దృష్ట్యా మెట్రో సమయాల్ని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12, ఒంటిగంట వరకు పొడిగించాలని, రాత్రి వేళల్లోనూ మెట్రో సేవలను అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: అమీర్పేట మెట్రో స్టేషన్లో బాంబు కలకలం