ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థ(వీఆర్వో)ను రద్దు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వారి సేవలు లేనిదే దస్త్రాలు కదలడం లేదు. ఆన్‌లైన్ పోర్టల్ ధరణి ఏర్పాటుతో వీఆర్వో వ్యవస్థ అవసరం లేదంటూ ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదో తేదీన శాసనసభలో చట్టం చేస్తూ వ్యవస్థను రద్దు చేసింది. 5,400 మంది వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని ప్రకటించింది. వారి స్థానాల్లో గ్రామ రెవెన్యూ సహాయకుల సేవలను వినియోగించుకుంటామని పేర్కొంది. ఇది జరిగి సరిగ్గా మూడు నెలలవుతున్నా ప్రత్యామ్నాయ కార్యాచరణ చేపట్టలేదు. దీంతో యథావిధిగా తహసీల్దారు కార్యాలయాల్లో వారు పాత విధులనే అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భూ సంబంధిత కార్యకలాపాలు పెరగడంతో రెవెన్యూ డివిజన్లు, తహసీల్దార్ల కార్యాలయాల్లో వారి సేవలను ఉపయోగించుకుంటున్నారు.
వీఆర్వోలు డీటీలు, ఆర్‌ఐల పరిధిలో పనిచేయాలంటూ పలు జిల్లాల్లో అధికారులు అంతర్గత ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.80 లక్షల సాదాబైనామా దరఖాస్తులు ప్రభుత్వానికి అందడంతో వాటిని పరిశీలించి, అర్హులను గుర్తించడం ఉన్న సిబ్బందికి భారంగా మారడంతో వీఆర్వోలను ఈ ప్రక్రియకు వినియోగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, పరిరక్షణ విధులు కూడా వేస్తున్నారు. వీఆర్వోలను తొలగించారనే విషయం ఇప్పటికే గ్రామ స్థాయికి చేరింది. అయితే తాజా పరిణామాలతో భూముల పరిశీలనకు వారు వస్తుండటం స్థానికులను అయోమయానికి గురిచేస్తోంది.
సిబ్బంది కొరతతో సతమతం
మరోపక్క రాష్ట్రంలోని 590 తహసీల్దారు కార్యాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. 150 పైగా కార్యాలయాలకు డిప్యూటీ తహసీల్దార్లే ఇన్‌ఛార్జులుగా ఉన్నారు. 100కు పైగా కార్యాలయాలకు పక్క మండల తహసీల్దారు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. డీటీలు, ఆర్‌ఐలు, సూపరింటెండెంట్‌ల కొరత భారీగా ఉంది.
రెవెన్యూలోనే కొనసాగిస్తారనే నమ్మకం ఉంది
ప్రభుత్వం వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే సర్దుబాటు చేయాలని.. సీఎంపై తమకు నమ్మకం ఉందని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం భూ సంబంధిత విధుల నుంచి తమను తప్పిస్తే.. కొందరు అధికారులు తిరిగి కావాలని భూ విచారణ పనులను అప్పగిస్తున్నారన్నారు. దీనివల్ల వీఆర్వోలు మానసిక ఒత్తిడిలో పనిచేయాల్సి వస్తోందని చెప్పారు. తప్పు చేసే అధికారాలేవీ తమకు లేవని, అయినా వ్యవస్థాగతమైన తప్పులకు వీఆర్వోలను బలిచేశారని ఆరోపించారు. ఇప్పటికైనా జూనియర్ సహాయకులుగా శాఖలోనే కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వాహనంతో తొక్కించి మహిళ హత్య.. డబ్బు వివాదమే కారణం..