VRAs protest in Telangana: శాసనసభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలు ఆందోళన బాటపట్టారు. జాతీయ రహదారులను నిర్భందించి రాస్తారోకోలు జరిపారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లాలో: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వీఆర్‌ఏలు నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మూడు నెలలుగా నిరవధిక సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ములుగు జిల్లాలో: తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని ములుగు వెంకటాపూర్ గొందరపేట మండల వీఆర్‌ఏలు ములుగు జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన దసరా రోజు కూడా వీఆర్ఏలు పస్తులు ఉండి.. సమ్మెను కొనసాగించారని, దీనికి ప్రభుత్వమే కారణమని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమ్మె ప్రారంభించి నేటికి 76 రోజులకు చేరిందని.. సుమారుగా 39 మంది వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
సంగారెడ్డి జిల్లాలో: అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా తమ పేస్కేల్ అమలు చేయాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని, వారసులకు ఉద్యోగాల జీవో విడుదల చేయాలని కోరుతూ పటాన్చెరు జాతీయ రహదారి 65పై వీఆర్‌లు రాస్తారోకోలు చేశారు. ఈ రాస్తారోకోకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.